సిడ్నీ: ప్రపంచ కప్ టోర్నీలో కీలకమైన మ్యాచ్ ఎదుర్కొంటున్న సమయంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బంతులతోనే కాక, ఏడడుగుల పొడవుతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టే పాక్ పేస్ బౌలర్ పొత్తి కడుపులో నొప్పి కారణంగా తదుపరి మ్యాచుకి దూరంగా ఉంటున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ఇర్ఫాన్ ఆడటం లేదు. ఏడడుగుల ఒక అంగుళం పొడవున్న ఇర్ఫాన్.. ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత పొడగరిగా రికార్డు సృష్టించాడు. తాను ఆడిన 5 లీగ్ మ్యాచుల్లో ఇర్ఫాన్ 8 వికెట్లు తీశాడు.
ఇర్ఫాన్ అందుబాటులో లేకపోవడంపై పిసిబి ఆందోళన వ్యక్తం చేసింది. ఒక వేళ పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్ పోరులో గెలిస్తే, సెమీ ఫైనల్ నాటికి అతను అందుబాటులో ఉంటాడని తెలిపింది.

ఆస్ట్రేలియాపైనే ఒత్తిడి
క్వార్టర్ ఫైనల్లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచు కోసం తామేమి ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ ఓపెనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఆస్ట్రేలియా జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. లీగ్ దశలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో శతకం చేసిన సర్ఫరాజ్.. పాక్ గెలుపులో కీలక భూమిక పోషించాడు.
గత మ్యాచుల్లో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన సర్ఫరాజ్.. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచులోనూ రాణిస్తానని తెలిపాడు. సొంత మైదానంలో ఆడుతున్నందున ఆస్ట్రేలియా జట్టుపైనే తీవ్ర ఒత్తిడి ఉంటుందని చెప్పాడు.