ప్రెటోరియా: ప్రియురాలిని హత్య చేసిన కేసులో బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఆరేళ్లు జైలు శిక్షను విధిస్తూ కోర్టు ప్రెటోరియా కోర్టు తీర్పు వెల్లడించింది. దక్షిణాఫ్రికాకు చెందిన బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ 2013 ఫిబ్రవరి 14వ తేదీన ప్రిటోరియాలోని తన నివాసంలో తన ప్రేయసి రీవా స్టీన్ కాంప్‌ను దారుణంగా కాల్చి చంపాడు.
ఎవరో ఆగంతకులు ప్రవేశించారనే ఉద్దేశంతో తాను పిస్టల్‌తో కాల్పులు జరిపానని, తాను రీవా స్టీన్ కాంప్ అనుకోలేదని, తన తప్పుడు అభిప్రాయం వల్లనే కాల్పుల్లో ఆమె మరణించిందని పిస్టోరియస్ చెప్పాడు. అయితే ఈ కేసులో అతడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది.
దీంతో కేసుకు సంబంధించి బుధవారం ప్రెటోరియా న్యాయస్థానం అతడికి శిక్ష ఖరారు చేసింది. వాస్తవానికి ఈ కేసులో పిస్టోరియస్ నేరానికి 15ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నా న్యాయమూర్తి శిక్ష తగ్గించారు. న్యాయమూర్తి తోకోజిలే మాసిపా తీర్పు చదువుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రెండు కాళ్లు పోగొట్టుకున్న ఒలింపిక్ రన్నర్‌కు తక్కువ శిక్ష వేస్తున్నట్లు చెప్పారు.

పిస్టోరియస్ 'పడిపోయిన కథానాయకుడు' అని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రాసిక్యూటర్లు లేదా పిస్టోరియస్ తరఫు ఢిఫెన్స్ లాయర్లు అప్పీల్‌కు వెళ్లడానికి వీలుగా న్యాయమూర్తి అవకాశం కల్పిస్తూ తీర్పును తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తీర్పు సమయంలో స్టీన్‌కాంప్ తల్లిదండ్రులు, పిస్టోరియస్ బంధువులు ఇతర పర్యవేక్షకులు కోర్టు హాలులో ఉన్నారు.
2013లో పిస్టోరియస్ తన ప్రేయసి రీవా టాయిలెట్‌లో ఉండగా డోర్ బయట నుంచే నాలుగు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె మృతిచెందింది. ఇంట్లోకి ఎవరో దుండగుడు వచ్చాడనుకుని తాను కాల్చానని పిస్టోరియస్ న్యాయమూర్తి ముందు చెప్పగా, ప్రాసిక్యూషన్ మాత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత కాల్చాడని వాదించింది.
దీంతో ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన పిస్టోరియస్ ఏడాది పాటు జైలులో ఉండి అక్టోబర్‌లో పెరోల్‌పై విడుదలయ్యాడు. ఈ తీర్పు చాలా తక్కువ తీవ్రత కలిగి ఉండడంతో దక్షిణాఫ్రికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో తాజాగా ఆరేళ్లు జైలు శిక్షను విధిస్తూ కోర్టు ప్రెటోరియా కోర్టు తీర్పు వెల్లడించింది.