
టోక్యో: పరిమిత సంఖ్యలో హాజరయ్యే ప్రేక్షకుల మధ్య టోక్యో ఒలింపిక్స్ జరుగొచ్చని క్రీడల నిర్వాహక కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తొషిరో ముటో అభిప్రాయపడ్డారు. విశ్వక్రీడలను వాయిదా లేదా రద్దు చేయాలన్న చర్చలేవీ ప్రస్తుతం జరుగడం లేదని గురువారం ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ కారణంగా వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 2021 జూలై 23న ప్రారంభం కావాల్సి ఉంది.
కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుండడంతో వచ్చే ఏడాది కూడా విశ్వక్రీడల నిర్వహణ కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తొషిరో ముటో గురువారం బీబీసీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగడంపైనే అందరి దృష్టి ఉంది. మేం కూడా విశ్వక్రీడలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని థామస్ బాచ్(ఐఓసీ చీఫ్) కూడా ఆలోచిస్తున్నారు. మేం కూడా అందుకే ప్రణాళిక రచిస్తున్నాం. ప్రజలు సురక్షితంగా ఫీలయ్యే వాతావరణాన్ని మేం కల్పిస్తాం' అని ముటో అన్నారు.
'జపాన్‌కు వచ్చే ముందు అథ్లెట్లు, ఐవోసీలోని అందరూ కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు పటిష్ఠమైన వైద్య వ్యవస్థ అవసరం అవుతుంది. అలాగే వసతి, రవాణా ప్రణాళికలను పక్కాగా ప్రణాళిక చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఒలింపిక్స్ సమయానికి అన్ని ఆంక్షలు తొలగిపోతాయనుకోవడం తొందరపాటే అవుతుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి. వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది' అని తొషిరో ముటో పేర్కొన్నారు.
వాస్తవంగా ఒలింపిక్స్ ఈ జూలైలో టోక్యోలో జరగాల్సి ఉంది. కానీ కొవిడ్-19 దెబ్బకు 2021 జూలైకి వాయిదా వేశారు. కానీ తాజాగా జపాన్‌లో కరోనా వ్యాప్తి పెరిగింది. దాంతో ప్రధాని షింజో అబె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం కూడా ఒలింపిక్స్ జరగడం కష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. వృద్ధులు అధికంగా ఉండే ఆ దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.