మరికొన్ని గంటల్లో పారిస్ ఒలింపిక్స్-2024 ప్రారంభంకానున్న వేళ ఫ్రాన్స్‌లో హింసాత్మక దాడులు చోటు చేసుకున్నాయి. రైల్వే నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని కీలకమైన ఇన్‌స్టాలేషన్లపై దాడులు జరిగాయి. దీంతో పలు హైస్పీడ్ రైళ్లపై ప్రభావం పడింది. రైల్వే నెట్‌వర్క్‌ను మునపటి స్థితికి తీసుకురావడానికి కొన్ని రోజుల పాటు సమయం పట్టనుంది.
రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన నెట్వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు చోట్లు రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు అంతరాయం కలిగించాలని అటాక్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పారిస్‌కు పశ్చిమంలో ఉన్న అనేక హై స్పీడ్ టీజీవీ లైన్లు ప్రభావానికి లోనయ్యాయి. దీంతో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. దాడి జరిగిన రైల్వే లైన్‌లో భారత నావికులు నేత్రా, విష్ణు ప్రయాణించాల్సి ఉందని సమాచారం.

కాగా, మరికొన్ని గంటల్లో సెన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలు జరగనునన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా విశ్వ క్రీడల ఆరంభోత్సవ వేడుకలు స్టేడియంలో కాకుండా తొలిసారి ఆరుబయట నదిలో జరగబోతున్నాయి. అంతేగాక వందేళ్ల తర్వాత ఫ్రాన్స్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుంది. 1900, 1924లో ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యమిచ్చింది.
ఈ కీలక సమయంలో రైల్వే నెట్‌వర్క్ దెబ్బతినడంతో ప్రయాణికులు, వీక్షకులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది. పారిస్ ఒలింపిక్స్‌కు భద్రతా ఏర్పాట్ల కోసం సుమారు 75వేల మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. కాగా, విశ్వక్రీడల్లో 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 6 క్రీడాంశాల్లో 117 మంది భారత క్రీడాకారులు పతకాలకు వేటకు సిద్ధమయ్యారు.