8 ఒలింపిక్స్‌లో:
1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా పాల్గొంది ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా. అంతేగాక మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌లో ఆడిన రెండో జిమ్నాస్ట్ మహిళగా చుసోవిటినా మరో రికార్డు కూడా సాధించింది. 8 ఒలింపిక్స్‌లో ఆడిన చుసోవిటినా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. ఏకంగా ఎనమిది ఒలింపిక్స్‌లో పాల్గొన్నా.. ఒక స్వర్ణం కూడా ఆమె గెలవలేకపోయింది. ఇదే ఆమెను వేదిస్తోందట. ఒలింపిక్స్‌లో రజతం సాధించినందుకు సంతోషంగానే ఉన్నా.. స్వర్ణం గెలిస్తే బాగుండేదని పేర్కొంది.

స్టాండింగ్ ఒవేషన్:
అత్యధిక ఒలింపిక్స్‌లో పాల్గొన్న 46 ఏళ్ల ఒక్సానాకు స్టాండింగ్ ఒవేషన్ (ఘనమైన వీడ్కోలు) టోక్యో నగరంలో లభించింది. అందరూ నిలబడి ఆమెను చప్పట్లతో అభినందించారు. తన చివరి ఒలింపిక్స్‌లో ఒక్సానా పతకం సాధించలేకపోయినా.. ఆమె పోరాటం మాత్రం అందరిలో స్ఫూర్తి నింపింది . దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తనకు ఇవే చివరి ఒలింపిక్స్ అని ఒక్సానా చుసోవిటినా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి ఒలింపిక్స్‌లో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో రెండు వాల్ట్స్ పూర్తి చేసి 14.166 స్కోరు నమోదు చేసింది. అయితే ఆమె చేసిన స్కోరు సరిపోకపోవడంతో క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే వెనుదిరిగింది.
బిడ్డ పుట్టడంతో:
1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో ఒక్సానా చుసోవిటినా మొదటిసారి అడుగుపెట్టింది. అప్పుడు సోవియట్ టీమ్ తరఫున ఆడగా.. ఆ టీమ్స్వర్ణం గెలుచుకుంది. జిమ్నాస్టిక్స్ కెరీర్ ప్రారంభించాక ఒక్సానా 17 ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీల్లో 11 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. ఆమె పేరిట జిమ్నాస్టిక్స్‌లో ప్రత్యేకమైన మూవ్స్ కూడా ఉన్నాయి. అవి ముందుగా ఆమె అనుకరించడంతో వారిటి ఒక్సానా పేరు పెట్టారు. కాగా 2000 సిడ్నీ ఒలింపిక్స్ ఒక్సానాకు చివరి ఒలింపిక్స్ అని అందరూ అనుకున్నారు. అప్పటికే ఆమెకు బిడ్డ పుట్టడంతో ఒక్సానా కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్సానా వరుసగా ఒలింపిక్స్‌లో పాల్గొంటూనే ఉంది.
చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో:
వాస్తవానికి ఒక్సానాకు బిడ్డ పుట్టడంతో ఒలింపిక్స్‌కు ఇక దూరంగా ఉండాలని భావించింది. అయితే 2002లో తన కుమారుడు అలిషర్ లుకేమియా బారిన పడ్డాడు. అయితే అతడికి చికిత్స చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో.. ఆమె మళ్లీ జిమ్నాస్టిక్స్ బరిలోకి దిగింది. అంతటి దు:ఖంలోనూ ఒక్సానా జిమ్నాస్టిక్ వాల్ట్‌లోకి దిగి ప్రపంచ టోర్నీల్లో సత్తాచాటింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి ఔరా అనిపించింది. వ్యక్తిగత విభాగంలో ఒక్సానా తొలి ఒలింపిక్స్ పతకం గెలుచుకొని అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. కాగా ఒలింపిక్స్ పూర్తయిన కొన్ని రోజులకే ఆమె కుమారుడు అలిషర్కు లుకేమియా పూర్తిగా తగ్గిపోయింది. 1975 జూన్ 19న జన్మించిన ఒక్సానా 1988లోనే జిమ్నాస్టిక్స్ కెరీర్ ప్రారంభించింది. సుదీర్ఘ కెరీర్‌తో ఎంతో మంది అథ్లెట్లకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది.


Click it and Unblock the Notifications












