
ముంబై: టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా తన అభిమాన నటుడిని కలుసుకున్నాడు. బుధవారం బాలీవుడ్ స్టార్ రణ్‌దీప్ హుడాని నీరజ్ కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్ హుడా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్న నీరజ్, రణ్‌దీప్.. తెల్లని దుస్తుల్లో కనిపించారు. ఆ సమయంలో వైరైటీ పోజు ఇచ్చారు. వీరిద్దరూ చాలా సమయం మాట్లాడుకున్నారట.
'సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎక్కడ చేరుకుంటారు?. ఈ ప్రశ్న చాలా తక్కువ మందికి ఎదురవుతుంది. అందులోనూ చాలా కొద్దిమంది వద్దే దీనికి సమాధానం ఉంటుంది. అలాంటి వారిలో ఒకరిగా నిన్ను కలిశా. నువ్వు అంత ఎత్తు ఎదిగావు తమ్ముడు' అంటూ నీరజ్ చోప్రాని ఉద్దేశించి రణ్‌దీప్ హుడా తన ట్వీటుకు కాప్షన్ రాసుకొచ్చాడు. 2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించాక.. నీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు రణ్‌దీప్ హుడా బాగుంటాడని నీరజ్ చెప్పాడు. అయితే ఈ ఇద్దరిదీ ఒకే రాష్ట్రం (హరియాణా) కావడం విశేషం. అంతేకాదు ఇద్దరికీ క్రీడలంటే ఎంతో ఇష్టం కూడా.
2021, ఆగస్టు16 నీరజ్ చోప్రా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో నీరజ్ మాట్లాడుతూ.. 'ఇంగ్లిష్, పంజాబీ, హిందీ.. ఈ మూడు భాషల్లో సినిమాలు చూస్తాను. రణ్‌దీప్ హుడా నటన అంటే నాకు చాలాచాలా ఇష్టం. రణ్‌దీప్ నటించిన 'లాల్‌రంగ్' అంటే చాలా ఇష్టం. మొత్తం హరియాణాలో మాట్లాడుకునే యాసలో ఉంటుందీ సినిమా . అవే కాదు.. ఆయన నటించిన 'సర్బజీత్', 'హైవే' కూడా ఆకట్టుకున్నాయి' అని తెలిపాడు. ఒకవేళ నీరజ్ బయోపిక్ తీస్తే.. గోల్డ్ మెడలిస్ట్ కోరిక మేరకు రణ్‌దీప్ హుడానే దర్శకుడు ఎంచుకునే అవకాశం ఉంటుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఒక ఆసక్తికర ఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు బయటపెట్టాడు. ఫైనల్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా తన జావెలిన్ కనిపించకుండా పోయిందని తెలిపాడు. 'ఎంత వెతికిన నా జావెలిన్ కనిపించలేదు. అయితే సడెన్‌గా అది పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ అర్షద్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్‌తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు' అని నీరజ్ పేర్కొన్నాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ అన్నాడు.
ఇక గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినప్పటి నుంచీ నీరజ్ చోప్రా సన్మాన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. దీనిపై స్పందిస్తూ.. 'ఇది సరైన పద్ధతి కాదు. మెడల్ గెలవగానే ఇలా అన్నీ ఒకేసారి చేసేయడం. నెల రోజుల తర్వాత పట్టించుకోకపోవడం మంచిది కాదు. స్పోర్ట్స్‌కు ఎప్పుడూ ఇదే విధమైన అటెన్షన్ ఉండాలి' అని నీరజ్ పేర్కొన్నాడు.