
హైదరాబాద్: దక్షిణ కొరియా ఆతిథ్యమిస్తోన్న వింటర్ ఒలింపిక్స్ కోసం 230 మందితో కూడిన ఛీర్ లీడర్స్ స్క్వాడ్‌ను పంపేందుకు ఉత్తర కొరియా అంగీకరించింది. గత పదేళ్లుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఆ రెండు దేశాలను ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్ కలిపాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ సిటీ ఆతిథ్యమిస్తోంది. ఈ వింటర్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలకు చెందిన అథ్లెట్లు ఒకే జెండా కింద మార్చ్ చేయనున్నారు.
ఈ మేరకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. గత రెండు సంవత్సరాలుగా ఈ వింటర్ ఒలింపిక్స్ కోసం ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ చర్చలు గతవారమే ఫలించాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలకు చెందిన 550 మంది క్రీడాకారులను ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌కు పంపించేందుకు అంగీకరించాయి.
దక్షిణ కొరియా ఆతిథ్యమిస్తున్న వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 9న అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నిత్యం ఉద్రిక్తతలతో ఉండే సరిహద్దు బలగాలున్న దక్షిణ ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో వింటర్ ఒలింపిక్స్‌ను శాంతియుత వాతావరణంలో జరుపాలని నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ కొరియా ప్రతినిధులు మీడియా సమావేశంలో తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.