
హైదరాబాద్: NBA అర్ధం నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్. నార్త్ అమెరికాలో పురుషుల ప్రొఫెషనల్స్ బాస్కెట్‌బాల్ లీగ్. ఈ లీగ్‌లో మొత్తం 30 జట్లు ఉంటాయి. కెనడా, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన గేముల్లో బాస్కెట్‌బాల్ ఒకటి. అయితే, తొలిసారి ఈ బాస్కెట్‌బాల్ టోర్నీ భారతదేశంలో జరగబోతోంది.
ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలిసారి జరగనున్న ఈ ఎన్‌బీఏ టోర్నీలో రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి ప్రత్యేక గౌరవం లభించింది. అక్టోబర్ 4న ఇండియానా పేసర్స్ vs శాంక్రామెంటో కింగ్స్ జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు ఆమె 'మ్యాచ్ బాల్'ను అందించనున్నారు.
ఎన్‌బీఏను భారతదేశానికి అధికారికంగా ఆహ్వానిస్తూ ప్రారంభోత్సవ 'మ్యాచ్ బాల్'ను ఎన్‌బీఏ నిర్వాహకులకు ఆమె అందించనున్నారు. ఈ లీగ్‌తో రిలయెన్స్ ఫౌండేషన్‌కు ఆరేళ్ల అనుభవం ఉంది. దీంతో రిలయెన్స్ ఫౌండేషన్ 'రిలయెన్స్ ఫౌండేషన్ జూనియర్' కార్యక్రమం ద్వారా దీనిని జరుపుకుంటోంది.
ఇందులో భాగంగా ఎన్‌బీఏ ప్రారంభోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్‌లోని చిన్నారుల్ని రిలయెన్స్ ఫౌండేషన్ స్టేడియానికి తీసుకురానుంది. అక్టోబర్ 4న ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరగనున్న తొలి మొట్టమొదటి గేమ్‌ను ఈ చిన్నారులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ "నేషనల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను భారతదేశానికి తీసుకురావడాన్ని రిలయెన్స్ ఫౌండేషన్ గర్వంగా భావిస్తోంది. స్టేడియంలో తొలిగేమ్‌ను ప్రత్యక్షంగా చూసే అద్భుతమైన అవకాశం ఈ చిన్నారులకు కల్పిస్తోంది. ఎన్‌బీఏతో మా ప్రయాణంలో ఇదో కీలకమైన పరిణామం" అని ఆమె అన్నారు.
"భారత్‌లో బాస్కెట్‌బాల్‌పై విశ్వాసం ఉంచినందుకు, మాతో భాగస్వామిగా ఉన్నందుకు ఎన్‌బీఏకు కృతజ్ఞతలు. విభిన్నమైన క్రీడల్లో భారతదేశం రాణిస్తోంది. క్రీడల్లో భారత భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని నీతా అంబానీ అన్నారు.