షాంఘై: వికారమైన చర్యలు కారణంగా ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్‌కు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫేషనల్స్(ఏటీపీ) 16,500 డాలర్ల జరిమానా విధించింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.11.02 లక్షలకు సమానం.
షాంఘై మాస్టర్స్ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా ఓటమిపాలయ్యాడన్న ఆరోపణలతో అతడిపై ఏటీపీ చర్యలు తీసుకుంది. మ్యాచ్‌లో భాగంగా సెకండ్ రౌండ్ ఓ అభిమానిపై నోరు పారేసుకుని దూషించినందుకు 5000డాలర్ల జరిమానా విధించారు.
అంతేకాకుండా కిర్గియోస్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శని కారణంగా 10,000 డాలర్లు, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మరో 1500 డాలర్ల ఫైన్ వేశారు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకులో 14వ స్థానంలో ఉన్న నిక్ కిర్గియోస్ తన క్రీడా జీవితంలోనే అత్యధిక మొత్తంలో విధించిన జరిమానా ఇదే కావడం విశేషం.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ ఆటగాడు మిస్కా జ్వెరేవ్ చేతిలో రెండో రౌండ్లో ఓటమిపాలయ్యాడు. ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేదని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడిన తీరు బట్టి టెన్నిస్ అసోసియేషన్ తెలుసుకుంది.
దీనిపై వివరణ అడగ్గా పొంతనలేని సమాధానం కూడా చెప్పడంతో కిర్గియోస్‌కు భారీ జరిమానా వేశారు. గతంలో కూడా పలుమార్లు కిర్గియోస్ ఏటీపీ 28 రోజుల పాటు నిషేధం విధించింది. ఈ ఘటనపై టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ స్పందించారు. కిర్గియోస్ జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.