
న్యూ ఢిల్లీ: ఇదేమీ బరువును తగ్గించే కంపెనీలకు సంబంధించిన ప్రకటన కాదిది. నిజంగా జరిగింది. మాజీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ చేసి చూపించింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. పోలెండ్‌లో ఇటీవలే ముగిసిన బాక్సింగ్ టోర్నీ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. అలాంటి చాంపియన్ బాక్సర్ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది.
కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. 'బరువు తగ్గకపోతే పోటీ చేయడానికి అర్హత సాధించలేకపోయే దాన్ని. వెంటనే బరువు కోల్పోవడం కోసం గంట పాటు స్కిప్పింగ్, స్ట్రెచింగ్ చేశాను.. జిమ్‌లో చాలాసేపు గడిపాను. నాలుగు గంటలు వ్యాయామం చేస్తూనే ఉన్నా. అనూహ్యంగా రెండు కేజీలు తగ్గాను. పోటీల్లో పాల్గొనగలిగాను' అని మేరీ చెప్పింది.
దీనిపై ఆమె మాట్లాడుతూ 'ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను' అని చెప్పింది. ఈ టోర్నీలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.