Neeraj Chopra: ఇటీవల పారిస్ డైమండ్ లీగ్‌లో టైటిల్ గెలిచిన మంచి ఊపులో ఉన్న నీరజ్ చోప్రా మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన గోల్డెన్ స్పైక్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా.. తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. కానీ మూడో త్రోలో జావెలిన్‌ను 85.29 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత వరుసగా 82.17, 81.01 మీటర్లు విసరగా.. చివరి ప్రయత్నంలో విఫలం అయ్యాడు.
తొమ్మిది మంది పాల్గొన్న ఫైనల్‌లో 84.12 మీటర్లతో సౌతాఫ్రికా ఆటగాడు డౌ స్మిత్ రెండో స్థానంలో నిలవగా.. 83.63 మీటర్లు విసిరి గ్రెనెడా ఆటగాడు ఆండర్సన్ పీటర్స్మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా.. టైటిల్ గెలిచినా తన ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తికి గురైనట్లు నీరజ్ చోప్రా అన్నాడు. ట్రోఫీ గెలిచినందుకు ఆనందంగానే ఉన్నా ప్రదర్శనపై సంతోషంగా లేనన్నాడు. ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందన్నాడు.

నీరజ్ చోప్రాకు అద్భుతమైన సంవత్సరం
నీరజ్ చోప్రాకు ఈ సంవత్సరం అద్భుతంగా సాగింది. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ ఓపెనర్‌లో నీరజ్ చోప్రా మొదటిసారిగా 90.23 మీటర్ల త్రోతో 90 మీటర్ల మార్కును అధిగమించాడు. అంతకు ముందు నీరజ్ చోప్రా 89.94 మీటర్ల ప్రదర్శనను అధిగమించాడు. ఈ మైలురాయిని అధిగమించినప్పటికీ నీరజ్ చోప్రా జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 91.06 మీటర్ల తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. దోహా తర్వాత నీరజ్ చోప్రా పోలాండ్‌లోని చోర్జోవ్‌లో జాసస్ కుసోసిన్స్కీ మెమోరియల్‌లో పాల్గొన్నాడు. అక్కడ నీరజ్ చోప్రా 84.14 మీటర్లు విసిరాడు. మళ్లీ జులియన్ వెబర్ 86.12 మీటర్లు విసరడంతో రెండో స్థానంలో నిలిచాడు. ఆపై నీరజ్ చోప్పా శుక్రవారం పారిస్ డైమండ్ లీగ్‌లో జులియన్ వెబర్‌ను చివరకు ఓడించాడు. అక్కడ భారత అథ్లెట్ తన మొదటి త్రోలోనే 88.16 మీటర్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.