అథ్లెటిక్స్ ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రో నీరజ్ చోప్రా సెంటీమీటర్ తేడాతో టైటిల్ చేజార్చుకున్నాడు. 0.01 మీటర్ల వెనుకంజతో రన్నరప్‌గా నిలిచాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోటీలో నీరజ్87.86 మీటర్ల దూరాన్ని ఈటెను విసిరాడు. తన మూడో ప్రయత్నంలో ఈ అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.
కరేబియన్ దేశం గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్లు ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ త్రోను వేసి ఛాంపియన్‌గా అవతరించాడు. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో అండర్సన్ పీటర్స్ కాంస్య పతకాన్ని నెగ్గిన విషయం తెలిసిందే.

మరోవైపు నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. అంతేగాక ఇటీవల జరిగిన లాసాన్ డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ చోప్రా రెండవ స్థానంలోనే నిలిచాడు. ఈ నేపథ్యంలో బ్రస్సెల్ వేదికగా జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌లోను సత్తాచాటి ఛాంపియన్‌గా నిలవాలని నీరజ్ పట్టుదలతో బరిలోకి దిగాడు. కానీ సెంటీమీటర్‌తో టైటిల్ చేజార్చుకున్నాడు.
స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్ వేదికగా జరిగిన డైమంల్ లీగ్ 2022 ఫైనల్లో నీరజ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది అమెరికాలోని యూజీన్ వేదికగా జరిగిన 2023 డైమండ్ లీగ్‌లో అతను రన్నరప్‌గా నిలిచాడు. కాగా, ఈ ఏడాది డైమండ్ లీగ్ ఫైనల్‌లో అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 87.87 మీటర్లు, నీరజ్ చోప్రా (భారత్) - 87.86 మీటర్లు, జూలియన్ వెబర్ (జర్మనీ) - 85.97 మీటర్లు, ఆండ్రియన్ మర్దారే (మోల్డోవా) - 82.79 మీటర్లు, జెంకీ డీన్ రోడ్రిక్ (జపాన్) - 80.37 మీటర్లు టాప్-5లో నిలిచారు.