భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో నీరజ్ చేసుకున్న అమ్మాయి ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటనే చర్చ తీవ్రంగా సాగుతోంది.
స్వస్థలం ఇదే
అయితే నీరజ్ భార్య పేరు హిమానీ. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి. హిమానీ హరియాణాలోని లార్సౌలీ ప్రాంతానికి చెందిన యువతి. పానిపట్ లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. దిల్లీ యూనివర్శిటీలోని మిరాండా హౌస్ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది.

అమెరికాలో చదువు
ప్రస్తుతం అమెరికాలో స్పోర్ట్స్ కు సంబంధించి చదువుకుంటోంది. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ఇన్ సైన్స్ చేస్తోంది. ఫ్రాంక్లిన్ పీర్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా పనిచేసింది. మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది. ప్రస్తుతం ఆమె.. తాను గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలేజ్ లోనే ఓ టెన్నిస్ టీమ్ ను మేనేజ్ చేస్తోంది.
కాగా, నీరజ్ చోప్రా - హిమానీ పెళ్లి.. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని నీరజ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నాడు. "నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని నా కుటుంబంతో కలిసి ప్రారంభించాను. మేము ఈ క్షణం వరకు నడిచేలా ఆశీర్వదించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు." అంటూ చోప్రా పేర్కొన్నాడు.
ఇకపోతే టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తో చరిత్ర సృష్టించిన 27 ఏళ్ల నీరజ్.. నిరుడు పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు.