ప్రపంచ నెంబర్ వన్ జావెలిన్ త్రోవర్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కొంత తడబడ్డాడు. జ్యూరిచ్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచి, ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న అతను ఈసారి మాత్రం తన బెస్ట్‌గా కనిపించలేదు. బెస్ట్ త్రో 85.71 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి డైమండ్ లీగ్ ఫైనల్ చేరాడు.
ఈ లీగ్‌లో మూడు ఫౌల్స్ వేసిన నీరజ్.. మూడు లీగల్ త్రోస్‌లో వరుసగా 80.79 మీటర్లు, 85.22 మీటర్లు, 85.71 మీటర్లు బల్లెం విసిరాడు. ఇలా మూడు ఫౌల్స్ వేయడం చూస్తేనే నీరజ్ పూర్తి ఫిట్‌గా లేడేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్.. ఆ తర్వాత తన భుజం కొద్దిగా నొప్పిగా ఉన్నట్లు తెలియజేశాడు.

ఈ కారణంగానే గురువారం జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి ఉంటాడని ఎక్స్‌పర్ట్స్ అనుకుంటున్నారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన యాకూబ్ వాడ్లెక్ (85.86) మీటర్లు తొలి స్థానంలో ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. వీళ్లిద్దరి మధ్య కేవలం కొన్ని సెంటిమీటర్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో యాకూబ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు.
అతను ఇప్పుడు నీరజ్‌ను దాటేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే యూఎస్ఏలోని యూజీన్ వేదికగా సెప్టెంబర్ 17న జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్ నాటికి నీరజ్ కోలుకుంటాడని అభిమానుల ఆశ. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు ముందు గజ్జల్లో బాధతో ఇబ్బంది పడ్డ నీరజ్.. ఈ పోటీల్లో గోల్డ్ సాధించి సత్తా చాటాడు. అయితే ఈ టోర్నీ ముగిసిన తర్వాత భుజం, వీపు నొప్పిగా ఉందన్నాడు.
ఈ క్రమంలో డైమండ్ లీగ్‌ను 80.79 మీటర్ల త్రో విసిరి రెండో స్థానంలో మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత వరుసగా రెండు ఫౌల్స్ విసిరి ఐదో స్థానానికి పడిపోయాడు. ఆ తర్వాత నాలుగో ట్రైలో 85.22 మీటర్లు త్రో విసిరిన నీరజ్.. ఐదోసారి మళ్లీ ఫౌల్ విసిరాడు. చివరి త్రోలో 85.71 మీటర్ల త్రోతో రెండో స్థానానికి చేరుకొని ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నాడు.
తన ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానని, మరీ ఎక్కువ కష్టపడి గాయాలపాలవడం తనకు ఇష్టం లేదని ఈ సందర్భంగా నీరజ్ చెప్పుకొచ్చాడు. డైమండ్ లీగ్, ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటంపై ఫోకస్ పెట్టినట్లు వెల్లడించాడు. అలాగే యాకూబ్ టాప్ ప్లేస్ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశాడు.