Diamond League Final: జూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం దక్కింది. ఇది నీరజ్ చోప్రాకు మూడోసారి రన్నరప్ ముగింపు కావడం గమనార్హం. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ తొలిసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూలియన్ వెబర్ ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో అయిన 91.57 మీటర్లు విసిరి అదరగొట్టాడు. నీరజ్ చోప్రా తన చివరి ప్రయత్నంలో 85.01 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో వరుసగా మూడో ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఈసారి తన అద్భుతమైన ప్రదర్శనతో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. జూలియన్ వెబర్ రెండు భారీ 90 మీటర్లకు పైగా త్రోలతో ఆకట్టుకున్నాడు. రెండో ప్రయత్నంలో 91.57 మీటర్ల ప్రపంచ అత్యుత్తమ త్రోతో పాటు, తొలి ప్రయత్నంలోనే 91.37 మీటర్లు విసిరి ఆధిపత్యం చాటాడు. అతని ఐదు లీగల్ త్రోలు 83 మీటర్ల కంటే ఎక్కువ ఉండడం అతని డామినేషన్‌ను చాటుతుంది.

ఇది నీరజ్ చోప్రాకు అంతగా కలిసిరాని రోజు. 27 ఏళ్ల ఈ భారత అథ్లెట్ 84.35 మీటర్లతో మొదలుపెట్టి ఆ తర్వాత 82 మీటర్లు విసిరిన తర్వాత ఫౌల్ అయ్యాడు. సగం పోటీ పూర్తయ్యేసరికి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కేశోర్న్ వాల్కాట్ వెనుక మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండు ఫౌల్స్ అయినప్పటికీ, చివరి రౌండ్‌లో 85.01 మీటర్లు విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. కేశోర్న్ వాల్కాట్‌ను కేవలం ఆరు సెంటీమీటర్ల తేడాతో వెనక్కి నెట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 82.06 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
"ఇది అంతగా చెడు కాదు," అని నీరజ్ ఈవెంట్ తర్వాత అన్నాడు. "మేము ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు దగ్గరవుతున్నాం, కాబట్టి నేను ఇంకా కొంచెం దూరం విసరాలి. కొన్ని విషయాలు బాగా జరిగాయి, మరికొన్ని జరగలేదు. కానీ జూలియన్ కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను - అతను నిజంగా చాలా దూరం విసిరాడు. 91 మీటర్లు విసరడం చాలా మంచి విషయం." అని నీరజ్ పేర్కొన్నాడు. నీరజ్ ఈ మధ్య కాలంలో 88 మీటర్ల మార్కును సులభంగా దాటుతున్నాడు. ఈ ఏడాది దోహాలో 90 మీటర్ల దూరాన్ని దాటాడు. ఇప్పుడు తన దృష్టి టోక్యోలో వచ్చే నెలలో జరగబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై ఉందని నీరజ్ పేర్కొన్నాడు. "పెద్ద ఛాంపియన్‌షిప్‌లలో దూరంగా విసరడం కంటే స్వర్ణం గెలవడం ముఖ్యం. కాబట్టి నేను పతకం గెలవడానికి నా వంతు కృషి చేస్తాను" అని అన్నాడు.