
లాస్‌ఏంజిల్స్: యూఎస్‌లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కొబ్ బ్రయంట్ (41) మృతి చెందారు. ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్‌బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్ మరణించారు. కొబ్ బ్రయంట్‌తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానా కూడా దుర్మరణం చెందింది. కొబ్ బ్రయంట్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం... ఆదివారం కొబ్ బ్రయంట్, ఆయన కూతురు జియానా, మరో ఏడుగురు సికోర్స్కీ ఎస్ -76 హెలీకాప్టర్లో ప్రయాణించారు. దట్టమైన మేఘాల కారణంగా హెలికాప్టర్ లాస్‌ఏంజిల్స్ పశ్చిమ కాలాబాసాస్లోలోని కొండపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న 9 మందితో సహా విమాన సిబ్బంది కూడా మరణించారు. కొబ్ బ్రయంట్, ఆయన కూతురు జియానాను అధికారులు గుర్తించగా.. పైలట్ మరియు మరో ఆరుగురు ప్రయాణికుల గుర్తింపుపై సమాచారం అందలేదు.
కొబ్ బ్రయంట్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కోబ్ అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కొబ్ బ్రయంట్ బాస్కెట్‌బాల్ క్రీడలో ఎంతో సంపాదించారు. కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరియర్‌లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. 2016లో ఎన్‌బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు.
పలుగురు క్రీడా పండితులు కొబ్ బ్రయంట్ మృతికి సంతాపం తెలిపారు. 'లేకర్ నేషన్, బాస్కెట్‌బాల్ క్రీడా మరియు మా నగరం కొబ్ లేకుండా ఎప్పటికీ ఒకేలా ఉండదు' అని లాస్ ఏంజిల్స్ మాజీ లేకర్స్ స్టార్ మ్యాజిక్ జాన్సన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. 'కాలిఫోర్నియాలోని హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్‌తో పాటు మరొకొంత మంది మరణించారని తెలిసింది. ఇది ఎంతో భయంకరమైన వార్త' అని ట్రంప్ ట్వీట్ చేసారు. 'బాస్కెట్‌బాల్‌లో కోబ్ ఓ లెజెండ్, కోబ్‌తో పాటు అతడి కుమార్తె గియానా కూడా ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరం' అని రాసుకొచ్చారు.