
హైదరాబాద్: ఆగస్టు 29. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి. ఈ రోజుని భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీతో పాటు పలువురు క్రీడాకారులు హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను స్మరించుకుంటున్నారు.
భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కింది. ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది.
హాకీలో భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు ధ్యాన్ చంద్ ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్ పేరు ప్రపంచ పటంలో మారుమ్రోగి పోవడంతో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు. దీంతో ప్రతి ఏడాది ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్ట్ 29న భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ధ్యాన్ చంద్ 113వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ధ్యాన్‌చంద్‌ను గుర్తు చేసుకున్నారు.