38వ జాతీయ క్రీడలకు రంగం సిద్ధమైంది. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీ రానున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఏడు నగరాలు ఈ మెగా క్రీడలకు ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ క్రీడా టోర్నీలో 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ట్రయథ్లాన్, హ్యాండ్‌బాల్ పోటీలు కూడా ప్రారంభమయ్యాయి.
ఇదే అతిపెద్ద క్రీడా టోర్నీ
ఈ క్రీడల్లో 38 జట్లు పాల్గొంటున్నాయి. దాదాపు 10 వేలకు పైగా అథ్లెట్లు, ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అథ్లెట్ల సంఖ్య ప్రకారం చూస్తే... ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద క్రీడా టోర్నీ కావడం విశేషం.

'మౌలి' మస్కట్
ఉత్తరాఖండ్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ క్రీడలను ఆ రాష్ట్రం ఘనంగా నిర్వహిస్తోంది. పైగా ఆ రాష్ట్ర పక్షి 'మోనాల్' కావడంతో.. దానినే స్ఫూర్తిగా తీసుకుని ఈ క్రీడలకు 'మౌలి' మస్కట్‌ను రూపొందించారు. ఈ మస్కెట్.. ఉత్తరాఖండ్ రాష్ట్ర సహజ అందాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
ఏఏ పోటీలు నిర్వహిస్తున్నారంటే
ఒలింపిక్ క్రీడలు అథ్లెటిక్స్, రెజ్లింగ్, షూటింగ్, స్విమ్మింగ్, హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్ సహా ఇతర ట్రెడిషనల్ గేమ్స్ కబడ్డీ, ఖోఖోనూ కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా యోగాసన, రాఫ్టింగ్ మల్లఖంబ్, కలరిప్పయట్టును కూడా ఈ క్రీడల్లో చేర్చారు. అయితే వీటికి మెడల్స్ ఇవ్వరు.
ఎవరెవరు పాల్గొంటున్నారంటే
ఒలింపిక్ పతక విజేతలు జ్యోతి యర్రాజి, లవ్లీనా , విజయ్ కుమార్ (షూటింగ్), సరబ్‌జోత్, స్వప్నిల్ కుశాలెతో పాటు పలువురు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశముంది. నీరజ్ చోప్రా, మను బాకర్ వేర్వేరు కారణాలతో ఈ క్రీడలకు అందుబాటులో ఉండట్లేదు.