న్యూఢిల్లీ: ఐపీఎల్-6 ఫిక్సింగ్, బెట్టింగులకు సంబంధించి ముద్గల్ కమిటీ రిపోర్టులో బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్‌తో పాటు మరో ముగ్గురి పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ ఆటగాడు ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినా శ్రీనివాసన్ చూసీచూడనట్లు వ్యవహరించాడని విచారణలో వెల్లడైనంట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ ఇండివిడ్యువల్ 3 ఎవరనేది హాట్‌టాపిక్‌గా మారింది. అతను భారత క్రికెటర్ అని పొక్కడంతో ఆ మూడో వ్యక్తి ఎవరా? అనేది చర్చనీయాంశమైంది. ఆ మూడో వ్యక్తి భారత జట్టు స్టార్ ఆటగాడు అంటున్నారు. ఈ వన్డే స్పెషలిస్ట్ తన బ్యాటింగ్ విన్యాసాలతో జ ట్టుకు ఊహించని విజయాలు అందించాడని, ఎన్నో వన్డేలు ఆడిన తర్వాత వచ్చేనె ల ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టులో స్థానం పొందాడని వార్తలు వస్తున్నాయి.
2010 శ్రీలంక టూర్‌లో ఓ మహిళతో పట్టుబడి చీవాట్లకు కూడా గురయ్యాడని వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పర్యటన సందర్భంగా తన రూమ్‌లో లేకుండా ఓ మహిళతో పట్టుబడిన ఆ క్రికెటర్ గురించి అప్పటి టీమ్ మేనేజర్ రంజిబ్ బిస్వాల్ మంగళవారం చెన్నైలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో చెప్పాడని తెలిసినట్లుగా ప్రచారం సాగుతోంది.

మూడో వ్యక్తి ఓ మహిళతో ఉన్న విషయం అప్పట్లో శ్రీనివాసన్‌తో పాటు కొంతమందికి మాత్రమే తెలుసంటున్నారు. కాగా, ఈ నెల 24న సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు తన వాదాన్ని వినిపించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది.
ముద్గల్ కమిటీ సుప్రీంకు అందజేసిన నివేదికలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఇండివిడ్యువల్ నెం 1 కాగా, రాజ్ కుంద్రా 11, సుందర్ రామన్ 12, శ్రీనివాసన్ 13గా పేర్కొంది. అయితే 2 నుంచి 10 వరకూ ఉన్న ఆటగాళ్ల పేర్లు బయటకు రాలేదు.
మేయప్పన్, రాజ్ కుంద్రాలకు బెట్టింగ్‌తో సంబంధం ఉన్నట్లు కమిటీ స్పష్టం చేయడంతో సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీలపై వేటుపడే అవకాశం ఉందంటున్నారు. ఐపీఎల్ నియమావళి ప్రకారం జట్లకు సంబంధించిన వారు అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే ఆయా ఫ్రాంఛైజీలను రద్దు చేసే అధికారం ఉంది.
మేయప్పన్ ఓ క్రికెట్ ఔత్సాహికుడు మాత్రమేనని చెప్పిన కెప్టెన్ ధోనీ మాటలు కూడా అబద్ధాలని తేలింది. సీఎస్‌కే జట్టు సభ్యులు, అధికారులు వాస్తవాలను తప్పుదారిపట్టించేలా వ్యాఖ్యలు చేశారని ముద్గల్ కమిటీ తెలిపింది. ఇండివిడ్యూయల్ 3లో పేరుగా ప్రముఖ క్రికెటర్ పేరు వినిపిస్తోంది.