
హైదరాబాద్: భారత స్టార్ స్ప్రింటర్ మొహమ్మద్ అనాస్ యహియా మరోసారి 400మీ రేసులో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. చెక్ రిపబ్లిక్‌లో శనివారం జరిగిన 400మీ రేసుని మొహమ్మద్ కేవలం 45.24 సెకన్లలోనే పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. తాజాగా తన రికార్డుని తానే బద్దలుకొడుతూ.. మొహమ్మద్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 400మీ రేసుని 45.31 సెకన్లలో పూర్తి చేసిన ఈ భారత స్ప్రింటర్.. కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. కానీ.. భారత్ తరఫున 400మీ రేసులో అదే బెస్ట్ ప్రదర్శన. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కాసింగ్ బంగారు పతకాన్ని గెలుపొందగా.. ఆ తర్వాత మళ్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌కి చేరిన రెండో భారత అథ్లెట్‌గా మొహమ్మద్ ఈ ఏడాది నిలిచిన విషయం తెలిసిందే.
ఆ మెగా టోర్నీలో పతకం చేజార్చుకున్నా.. తాజాగా తన ప్రదర్శనని మెరుగుపర్చుకుని పసిడిని గెలుపొందాడు. భారత్‌కి బంగారు పతకాన్ని అందించిన మొహ్మద్‌ని ట్విటర్‌లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అభినందించింది. మహిళల విభాగంలో పూవమ్మ 400మీ రేసుని 50.31 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలవగా.. 200మీ విభాగంలో పోటీపడిన రాజీవ్ 20.77 సెకన్లలో రేసుని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.
ఇటీవలే 400మీ రేసులో మరో స్పింటర్.. ఫిన్లాండ్‌లోని టాంపెరె వేదికగా జరుగుతున్న ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం సాధించారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్ నిలిచారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ దాస్ తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు.