న్యూఢిల్లీ: తాను అమాయకురాలినని, తనకేమీ తెలియదని భారత వెయిట్ లిఫ్టర్ మోనికా దేవి అన్నారు. డోపింగ్ టెస్టులో పట్టుబడి బీజింగ్ ఓలింపిక్స్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. తనన కావాలని ఇరికించారని ఆమె అన్నది. డోపింగ్ టెస్టులో పట్టుబడడంతో ఆమె బీజింగ్ ఓలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అసోసియేషన్ తో పాటు శైలజ కుట్ర చేసి తనను ఇరికించారని ఆమె ఆరోపించింది. ఆమె విలేకరుల సమావేశంలో కళ్లనీళ్ల పర్యంతమయ్యారు, ఏడ్చేశారు. తన కెరీర్ ను ఇలా ముగించుకోవడం తనకు ఇష్టం లేదని, అందువల్ల తాను ఏ తప్పూ చేయలేదని ఆమె అన్నది.
తాను ఇప్పటి వరకు ఏనాడూ డ్రగ్స్ ముట్టుకోలేదని ఆమె అన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతై ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని ఆమె అన్నారు. తాను జీవితంలో అక్రమ పదార్థాలు ముట్టుకోలేదని, తాను డోపింగ్ టెస్టులో ఎప్పుడు కూడా పట్టుబడలేదని ఆమె అన్నారు. తన పోటీదారు శైలజ చెత్త రాజకీయాలు ఆడిందని, ఐదు సార్లు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన శైలజను అసోసియేషన్ ఓలింపిక్స్ ఎలా సిఫార్సు చేస్తుందని ఆమె అన్నారు. తనకు 30 పరీక్షలు జరిగాయని, ఏ పరీక్షలో కూడా ప్రతికూల ఫలితం రాలేదని, ఇదంతా తాను ఓలింపిక్స్ లో పాల్గొనకుండా అసోసియేషన్ ఆడిన నాటకమని ఆమె అన్నారు.