
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో భారత్ తన జయ కేతనాన్ని ఎగురవేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని అందుకుంది. మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని ముద్దాడారు. 49 కేజీలో ఈ విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తి అవతల పారేశారు. ఈ కేటగిరీలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది. భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇండోనేషియా కాంస్య పతకాన్ని సాధించింది.
ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశం మొత్తం గర్వపడేలా చేశారు చాను. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనే మరిన్ని పతకాలను గెలుచుకోవడానికి స్ఫూర్తినిచ్చారు. మీరాబాయి చాను స్వరాష్ట్రం మణిపూర్. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంటే చిన్న చూస్తుంటారు. చైనీయులంటూ ఎద్దేవా చేస్తుంటారు. అలాంటి వివక్షపూరక వాతావరణం నుంచి వచ్చిన మీరాబాయి.. దేశ ప్రజలు సగర్వంగా తల ఎత్తుకునేలా చేశారు. మణిపూర్ తూర్పు ప్రాంతంలోని నన్‌పోక్ కక్చింగా ఆమె స్వగ్రామం.
ఈ ఉదయం వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ ఉండటంతో ఆ గ్రామ ప్రజలందరూ మీరాబాయి ఇంటికి చేరుకున్నారు. బంధుమిత్రులు టీవీలకు అతుక్కుపోయారు. ఉత్కంఠభరితంగా లైవ్ టెలికాస్ట్‌ను చూస్తూ గడిపారు. ఒక్కో అంచెను దాటుకుంటూ టాప్-3లోకి చేరుకుంటున్న కొద్దీ ఆ గ్రామంలో సందడి పెరుగుతూ పోయింది. టాప్-3లో స్థానం ఖాయం చేసుకున్న తరువాత ఇక పండుగ వాతావరణం నెలకొంది. మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఇక స్నాచింగ్, క్లీన్ అండ్ జెర్క్‌లో చైనా వెయిట్ లిఫ్టర్‌తో పోటీ పడకలేకపోవడం నిరాశకు గురి చేసినప్పటికీ జోష్ మాత్రం తగ్గలేదు.
2000 ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన తరువాత.. అదే విభాగంలో రికార్డును నెలకొల్పారు. మణిపూర్ ప్రభుత్వం అప్పటికప్పుడు స్పందించింది. మీరాబాయి చాను తల్లిదండ్రులు సైఖోమ్ కృతి, సైఖోమ్ టోంబిలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మీరాబాయి బంగారు పతకాన్ని సాధిస్తుందని ఆశించామని, మొదటి స్థానంలో నిలవలేకపోవడం కొంత నిరాశకు గురి చేసిందని వారు వ్యాఖ్యానించారు. రజత పతకాన్ని అందుకోవడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. మీరా చాను పతకాన్ని సాధించడం పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజెజు హర్షం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని చాను మాట ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు.