పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాల కంటే మించి మెడల్స్ సాధించాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు పారిస్‌కు సిద్ధమయ్యారు. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు.
వాళ్లలో పక్కా పతకాలు సాధించే క్రీడాకారుల్లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఒకరు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించింన మీరాబాయి ఈ సారి స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆమె మరోసారి విశ్వవేదికపై భారత్ ఖ్యాతి పెంచుతుందని దేశమంతా ఎదురుచూస్తుంది. అయితే మీరాబాయి దేశం కోసం పతకాలు సాధించడంలో ఓ ప్రత్యేకత ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది ఆమెనే. రెండో రోజే భారత్ బోణీ కొట్టేలా చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది క్రీడాకారిణి చరిత్రకెక్కింది. అంతేగాక 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె పోటీలు ఆలస్యంగా మొదలుకానున్నాయి. ఆమె మ్యాచ్ ఆగష్టు 7న జరగనుంది.
అయితే గత కొంతకాలంగా మీరాబాయి చాను గాయాలతో పోరాడింది. అయినప్పటికీ తిరిగి సత్తాచాటడానికి భారత వెయిట్ లిఫ్టింగ్ ప్రధాన కోచ్ విజయ్ శర్మ కారణం అని మీరాబాయి పేర్కొంది. తనని అథ్లెట్‌లానే కాకుండా, సొంత కూతురిలా చూసుకున్నాడని తెలిపింది. 'మైఖేల్'తో మీరాబాయి, ఆమె హెడ్ కోచ్ విజయ్ శర్మ మాట్లాడారు. ''విజయ్ సార్.. అథ్లెట్‌లానే కాకుండా కూతురిలా చూసుకున్నారు. ఆయన తిరుగులేని మద్దతుతోనే కష్టతరమైన దశలను దాటి నిలబడ్డాను''
''ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాను. ప్రతి సవాలు నన్ను మరింత బలంగా చేసింది.పారిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఒత్తిడిలో లోనవ్వట్లేదు. ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. పతకం అదే వస్తుంది'' అని మీరాబాయి పేర్కొంది.
''మీరాబాయి చాలా కష్టమైన దశను అధిగమించింది. ఆమె కోలుకోవడంపై దృష్టిసారించాం. ఆమె గాయపడకుండా ఉండేలా సన్నద్ధం చేశాం. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. పారిస్‌లో పతకం సాధిస్తాం'' అని విజయ్ చెప్పారు. మీరాబాయి కెరీర్‌లో ఆది నుంచే గాయాలు తోడుగా ఉన్నాయి. 2018 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత వెన్నెముకలో ఆమెకు తీవ్రగాయమైంది. కోలుకోవడానికి ఏకంగా తొమ్మిది నెలలు పట్టింది. దీంతో ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలను కోల్పోయింది.
2022 శిక్షణ సమయంలోనూ ఆమె భుజం, మణికట్టుకు గాయమైంది. అంతేగాక హాంగ్‌జౌలో తన కుడితుంటికి గాయమైంది. ఇలా వరుస గాయాలపాలైనా మనోధైర్యంతో కోలుకుని ముందుకు సాగింది. 184 కేజీల బరువులు ఎత్తి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.