
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న వేళ ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
వివరాల్లోకి వెళితే... ఇండోనేషియాలో ఆసియా గేమ్స్ జరుగుతోన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఒలింపిక్ పతక విజేత, కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ జకార్తాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాథోడ్ క్రీడాకారులను స్వయంగా కలుసుకుని వారితో మాట్లాడుతున్నారు.
ఈ ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాథోడ్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా, రాథోడ్ ఆటగాళ్లందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ హాల్ వద్దకు వెళ్లారు. మంత్రి వచ్చిన సంగతిని క్రీడాకారులు గుర్తించలేదు. ఎవరి పనిలో వారు బిజీగా భోజనం చేస్తూ ఉన్నారు.
అదే సమయంలో రాథోడ్ బౌల్స్‌లో సూప్, టీ పోసుకుని ప్లేటులో పెట్టుకుని ఆటగాళ్ల కోసం తీసుకెళ్లారు. ఈ సమయంలో మంత్రి రాథోడ్ వచ్చాడని గుర్తించిన క్రీడాకారులు వెంటనే ఆయన వద్దకు వచ్చి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోను చూసిన ఓ నెటిజన్ "ఆటగాళ్ల కోసం సర్వర్‌గా మారిన మంత్రి" అని కామెంట్ పోస్టు చేయగా, మరొక నెటిజన్ "మంత్రిది ఎంత మంచి మనస్సో" అంటూ కామెంట్ పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే, ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 45కు చేరింది. భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, 16 రజతాలు, 21 కాంస్య పతకాలు ఉన్నాయి.