
న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు బుధవారం సాయంత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఛండీగఢ్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిల్కా పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అతని భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. అయితే ఆయన వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంట్లో పని చేసే సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతను పరీక్షలు చేయించుకున్నారు. సింగ్ ఇప్పటివరకు వాక్సిన్ వేసుకోలేదట.
కుమార్తె మోనా మిల్కా సింగ్ న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ హాస్పిటల్‌లో వైద్యురాలని, ఆమె ఎప్పటికప్పుడు వీడియో కాల్ ద్వారా తన తండ్రికి సలహాలు సూచనలు ఇస్తుందని నిర్మల్ కౌర్ పేర్కొన్నారు. సింగ్‌కు హై ఫీవర్ వచ్చిందని.. కానీ టేస్ట్, స్మెల్ బాగానే తెలుస్తున్నాయన్నారు. మిల్కా సింగ్ మాట్లాడుతూ.. 'నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. బుధవారం జాగింగ్ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్ రావడంతో ఆశ్యర్యపోయా' అని అన్నారు. స్థానిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆయనను చూసుకోవడానికి ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు ఓ సహాయకుడిని నియమించింది.
అథ్లెట్‌గా ఎంతో ఖ్యాతి గడించిన మిల్కా సింగ్.. ఒలింపిక్ పతకం మాత్రం సాధించలేకపోయారు. కెరీర్‌లో ఎన్నో మరపురాని మారథాన్లలో పాల్గొన్న మిల్కాకి.. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేస్ చాలా ప్రత్యేకం. ఈ పోటీల్లో అతను నాలుగో స్థానంలో నిలిచినా.. ట్రాక్‌పై అతను చూపిన తెగువతో భారతీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ రేస్ ద్వారా అతను ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా నిలిచారు. అలాగే ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన ఏకైక అథ్లెట్ కూడా ఆయనే. భారత ప్రభుత్వం అతడ్ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఈ వయసులోనూ మిల్కా సింగ్ పూర్తి ఫిట్‌గా ఉన్నారు. నిత్యం జాగింగ్ చేయడంతో పాటు ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. కరోనా సమయంలో రోజూ 15 నుంచి 20 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ఎక్సర్‌సైజ్ చేయడం ఆవశ్యకమన్నారు. తాను మితంగా భోజనం చేస్తానని, వేకువజామునే నిద్రలేచి జాగింగ్ చేస్తానని మిల్కా గతంలో తెలిపారు. కొద్దిపాటి అనారోగ్యం తలెత్తినా తాను ఎలాంటి మందులు వేసుకోనని.. జాగింగ్ చేస్తే తగ్గిపోతుందన్నారు.