హైదరాబాద్ : సింధు.. సింధు.. ఇంకొద్ది గంటల్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవనున్న నేపథ్యంలో.. దేశమంతా ఇప్పుడు సింధు మేనియాలో ఊగిపోతుంది. అటు మీడియా నోటా.. ఇటు జనం నోటా.. ఇప్పుడు ఒకే మాట.. సింధు ఫైనల్లో గెలుస్తుందా..? భారత్ కు స్వర్ణం అందిస్తుందా..?
రియో ఒలింపిక్స్ 2016లో ఫైనల్‌కు చేరిన పీవీ సింధు పైన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తదితరులు స్పందిస్తున్నారు. శుక్రవారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో సింధు - కరోలినా మారిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. పీవీ సింధు కచ్చితంగా ఫైనల్ మ్యాచులో గెలుస్తుందని, స్వర్ణం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అంటే క్రికెట్ మాత్రమే కాదని ఆమె అన్నారు.
పీవీ సింధు గెలుపు పైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పీవీ సింధు స్వర్ణం గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరి చూపు పీవీ సింధు వైపే
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ కోసం దేశం యావత్తు ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌ను తప్పకుండా వీక్షిస్తామని దేశంలోని స్టార్ క్రికెటర్లు, ప్రముఖులు, సెలెబ్రిటీలు ఇప్పటికే చెప్పారు. సింధు స్వర్ణం గెలవాలని ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయించారు.
హోరాహోరీ తప్పదేమో..
పీవీ సింధు, కరోలినా మారిన్ ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా నాలుగింటిలో మారిన్, రెండింట్లో సింధు గెలుపొందింది. ఎడమ చేతి షట్లర్ మారిన్‌తో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో 21-7, 15-21, 21-13, డెన్మార్క్ ఓపెన్ 21-15, 18-21, 21-17తో మారిన్‌ను సింధు ఓడించింది. ఇది కాకుండా ఒకసారి వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లోనూ 21-17, 21-19తో మారిన్ పైన గెలిచింది.
మరికొద్ది సేపట్లో ఈ మీమాంసకు తెరపడనున్న నేపథ్యంలో.. పీవీ సింధు కోచ్ పుల్లెల గోపిచంద్ అకాడమీకి ప్రస్తుతం మీడియా ప్రతినిధులంతా క్యూ కట్టారు. సింధు ఆటను బిగ్ స్క్రీన్ పై వీక్షించేందుకు వీలుగా గచ్చిబౌలిలో ఉన్న గోపిచంద్ అకాడమీలో ఏర్పాట్లు చేయడంతో.. జాతీయ మీడియాతో సహా లోకల్ మీడియా ప్రతినిధులంతా ఇక్కడి నుంచే న్యూస్ కవరేజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఏపీ బీజేపీ నేత పురంధేశ్వరి కూడా సింధు ఫైనల్ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్ పై వీక్షించేందుకు గోపిచంద్ అకాడమీకి చేరుకోవడం విశేషం.

సెలబ్రీటీల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరు సింధు గెలుపు కోసం ఆకాంక్షిస్తున్న తరుణంలో.. ఫైనల్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలోను ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. కాగా, మరికొద్ది సేపట్లో మొదలయ్యే ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ క్రీడాకారిణి మారినాతో తలపడనున్న విషయం తెలిసిందే.