హైదరాబాద్: లాస్ వెగాల్‌లోని టీ-మొబైల్ అరీనాలో 'ఫైట్ ఆఫ్ ది మిలీనియమ్'గా అభివర్ణించిన పోరులో కానర్ మెక్‌గ్రెగర్‌పై ఫ్లాయిడ్ మేవెదర్ విజయం సాధించాడు. దాదాపు గంట సేపు సాగిన బాక్సింగ్ పోరులో ప్రత్యర్థి కానర్ మెక్ గ్రెగర్ ను మట్టి కరిపించిన ఫ్లాయిడ్ మేవెదర్ సుమారు రూ. 1,280 కోట్లను ఎగరేసుకుపోయాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ బౌట్‌లో ఫ్లాయిడ్ మేవెదర్ విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం పకియావ్‌తో మ్యాచ్ అనంతరం బాక్సింగ్‌కు వీడ్కోలు పలికి.. తర్వాత మనసు మార్చుకున్న 40 ఏళ్ల మేవెదర్ శనివారం కానర్ మెక్‌గ్రెగర్‌తో తలపడ్డాడు.

10 రౌండ్లపాటు జరిగిన మ్యాచ్‌లో పాయింట్ల ఆధారంగా మేవెదర్ గెలుపొందినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా అజేయంగా 50 మ్యాచ్‌లు గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ బౌట్‌తో ఇరువురు బాక్సర్లకు కళ్లు చెదిరే మొత్తం అందింది.
దాదాపుగా రూ.1700 కోట్లు ప్రైజ్‌మనీ గల ఈ పోరుతో విజేత అయిన మేవెదర్‌కు రూ.1,280 కోట్లు, ఓడిపోయిన మెక్‌గ్రెగర్‌కు సుమారు రూ.400కోట్లు దక్కనున్నాయి. ఈ బౌట్‌లో నెగ్గిన విజేతకు బహూకరించిన బెల్ట్ కూడా ఎంతో విలువైనదే.
ఈ బెల్టులో 1.5 కిలోల స్వచ్ఛమైన 24 కేరట్ల బంగారం, 3,360 వజ్రాలు, 600 ఇంద్రనీలాలు, 160 పచ్చలతో కూడుకుని మొసలి చర్మంతో కూడిన బెల్ట్‌ను విజేతకు అందించారు. మ్యాచ్ పూర్తైన అనంతరం మేవెదర్ మీడియాతో మాట్లాడాడు. తాను అనుకున్న దానికంటే మెక్‌గ్రెగర్ బలవంతుడని, అతడితో పోటీ కష్టంగానే ఉందని అన్నాడు.