ఇంచియాన్: పతకాల ప్రదానం సందర్భంగా ఆసియా క్రీడల్లో సరితా దేవి ప్రవర్తన పట్ల బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సెమీ ఫైనల్ విజేతల ప్రకటన వివాదం కారణంగా సరితా దేవి కాంస్య పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించారు.
సరితా దేవి పరిస్థితికి మేరీ కోమ్ విచారం వ్యక్తం చేస్తూనే ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు విచారం కలిగిందని, అయితే తాము నిస్సహాయులమని, తాము ఏమీ చేయలేమని, అది అన్యాయమైన నిర్ణయం, ఇది భవిష్యత్తులో జరగకూడదని మేరీ కోమ్ ఓ టెలివిజన్ కార్యక్రమంలో అన్నారు.

పతకం తీసుకోవడానికి ఇష్టం లేకపోతే సరే కానీ పతక ప్రదాన కార్యక్రమానికి వెళ్లాల్సింది కాదని మేరీ కోమ్ అభిప్రాయపడ్డారు. జడ్జీలు చేయాల్సిందంతా చేశారని, దాని గురించి దక్షిణా కొరియా బాక్సర్‌కు ఏమీ తెలియదని అన్నారు.
జినా పార్క్ పట్ల ప్రేమతో జడ్జీలు లైట్ వెయిటింగ్ 60 కెజిలీ విభాగంలో సరితా దేవికి ఫైనల్ ప్రవేశం కల్పించలేదు. భారత్ చేసిన అపీల్‌ను కూడా వారు తిరస్కరించారు. దీంతో సరితా దేవి కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో సరితా దేవి పతకాలు ప్రదానం చేసే వేదిక వద్ద బోరున ఏడ్చేస్తూ పతకం స్వీకరించడానికి నిరాకరించారు.