రియో డీ జనీరో: వరుస విజయాలతో టెన్నిస్ ప్రపంచంలో సానియా మిర్జా, మార్టినా హింగిస్ జోడి సంచనాలను సృష్టించారు. ఒక్క 2015లోనే గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో కలిపి ఈ జోడీ తొమ్మిది టైటిళ్లను సొంతం చేసుకుంది. 'శాంటియా'గా పేరుగాంచిన ఈ జోడీ ఈ మధ్య కాలంలో ఆశించిన మేర విజయాలను సాధించలేదు.
ఈ క్రమంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వేరొక పార్ట్‌నర్‌ను చూసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే హఠాత్తుగా వీరిద్దరి జోడి విడిపోవడం వెనుక ఏదో కారణం ఉందనే ఉహాగానాలు వెలువడ్డాయి. జాతీయ మీడియా ఇంకో అడుగు ముందుకేసి వీరిద్దరి మధ్య గొడవ జరిగిందనే ప్రచారానికి కూడా తెరలేపింది.

అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ మార్టినా హింగిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా మిర్జాతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఇటీవల కాలంలో మా జోడీ అంచనాలకు తగినట్లు రాణించకపోవడం వల్లే పరస్పర అంగీకారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు హింగిస్ అందులో పేర్కొంది.
ఇది పూర్తిగా వృత్తిపరమైన నిర్ణయమని, ఇది తమ వ్యక్తిగత సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆమె స్పష్టంచేసింది. ఈ విషయంపై ఊహాగానాలకు ఇకనైనా తెరదించాలని తేల్చి చెప్పింది. ఈ ఏడాది చివర్లో తామిద్దరం కలిసి ఆక్టోబర్‌లో సింగపూర్‌లో జరగే డబ్ల్యూటీఏ టైటిల్‌ను డిఫెండ్ చేసుకుంటామనే నమ్మకం వ్యక్తంచేసింది.
2015లో మూడు గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ కూడా గెలిచి వరల్డ్ నంబర్ వన్ సొంతం చేసుకున్నారు. సానియా తన కెరీర్‌లో తొలిసారి ఉమెన్స్ డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హింగిస్‌తో కలిసే సొంతం చేసుకుంది. వీరిద్దరూ కలిసి 14 టైటిల్స్ గెలిచారు. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ అంచనాలను తగినట్లు రాణించలేకపోయింది.