ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్: 16 ఏళ్లకే పసిడి గెలిచిన మను భకర్

హైదరాబాద్: మెక్సికో వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీనియర్ షూటింగ్ వరల్డ్‌కప్ పోటీల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తొలిరోజు మూడు పతకాలను సొంతం చేసుకున్న భారత్... రెండో రోజైన మంగళవారం మన షూటర్లు ఆదరగొట్టారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హర్యానాకు చెందిన 16 ఏళ్ల మనూ భకర్ స్వర్ణం సాధించింది. రెండుసార్లు వరల్డ్‌కప్ ఫైనల్ విజేత, ఆతిథ్య దేశానికి చెందిన అలెజంద్ర జవాలను వెనక్కి నెట్టి మను భకర్ స్వర్ణం సాధించడం విశేషం.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను 237.5 పాయింట్లతో స్వర్ణం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 237.1 పాయింట్లతో జవాలా రెండో స్థానంలో నిలవగా... ఫ్రాన్స్‌కు చెందిన సీలైన్ గోబర్‌విల్లే (217 పాయింట్ల)తో మూడో స్ధానంలో నిలిచింది.
మరో భారత క్రీడాకారిణి యసశ్విని సింగ్ 196.1 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రవికుమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్ పోటీల్లో భారత్‌కు మొత్తం 5 పతకాలు దక్కాయి.
ఇందులో రెండు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. గతేడాది ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 49వ స్థానంలో నిలిచిన మను ఈ ఏడాది స్వర్ణం సాధించడం విశేషం. ప్రస్తుతం మను భకర్ 11వ తరగతి చదువుతోంది.
పసిడి పతకం సాధించిన అనంతరం మను భకర్ మాట్లాడుతూ 'పసిడిని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. తొలి వరల్డ్ కప్ పోటీల్లోనే గోల్డ్ గెలిచాను. భవిష్యత్తులో మంచి ప్రదర్శనల చేసి మరిన్ని పతకాలు సాధిస్తా' అని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications