Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్.. మరో రెండు పతకాలకు చేరువైంది. మహిళల బాక్సింగ్, పురుషులు బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పతకాల ముంగిట్లో నిలిచింది. అన్నీ సవ్యంగా సాగితే ఈ రెండింట్లో మెడల్ ఖాయమౌతుంది. వాటి సంఖ్య అయిదుకు చేరుతుంది.
మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్.. మిడిల్ వెయిట్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ ఆడునున్నారు. చైనాకు చెందిన లి క్వియాన్‌తో తలపడననున్నారు. ఈ మధ్యాహ్నం 3:05 నిమిషాలకు గేమ్ ఆరంభమౌతుంది. ఇందులో గెలిస్తే కాంస్యం ఖాయం. టోక్యో ఒలింపిక్స్ 2021లోనూ లవ్లీనా ఇదే కేటగిరీలో కాంస్యాన్ని అందుకున్నారు.

బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత్ స్టార్ లక్ష్యసేన్ సెమీ ఫైనల్స్ ఆడబోతున్నాడు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌ను ఢీకొట్టనున్నాడు. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రజత పతకాన్ని ఖరారు చేసే మ్యాచ్ ఇది. ఓడినా కూడా పతకాన్ని పొందే అవకాశం ఉంది. కాంస్యం కోసం మరో గేమ్ ఆడాల్సి ఉంటుంది లక్ష్యసేన్‌కు.
ఈ రెండింట్లోనూ భారత్ తన పతకాల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది భారత్. ఈ మూడు కూడా షూటింగ్‌లో దక్కినవే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ కేటగిరీల్లో మనుభాకర్, మనుభాకర్- సరబ్జొత్ సింగ్ జోడీ, పురుషుల 50 మీటర్ల రైఫిల్స్ సింగిల్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె కాంస్యాన్ని అందుకున్నారు.
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పతకంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న పీవీ సింధు.. ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన హె బింగ్‌ఝియావో చేతిలో ఓడిపోయారు. 21-19, 21-14 సెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను ముద్దాడిన మనూ భాకర్‌కు.. అరుదైన అవకాశం లభించింది. ఒలింపిక్స్ క్లోజింగ్ సెరెమనిలో భారత ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించనున్నారు. మహిళా అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్‌బేరర్‌గా ఉండబోతోన్నట్లు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వెల్లడించింది. పురుషుల టీమ్‌కు ఎవరు ఫ్లాగ్‌బేరర్‌గా ఉంటారనేది ఇంకా నిర్ధారణ కాలేదు.