
హైదరాబాద్: సిడ్నీ వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో మను బకర్ భారత్‌కు పసిడి పతకం అందించింది. ఇటీవలే మెక్సికో వేదికగా ముగిసిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో రెండు బంగారు పతకాలు సాధించి సంచలనం సృష్టించిన 16 ఏళ్ల మను బకర్ ఇప్పుడు జూనియర్ వరల్డ్ కప్‌లో కూడా రాణిస్తోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను బకరం స్వర్ణం పతకం సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో 235.9 పాయింట్లతో మను బకర్ స్వర్ణం గెలుచుకోగా... థాయ్‌లాండ్‌కు చెందిన కన్యాకోర్న్ హిరున్ఫోయి 234.9 పాయింట్లతో రెండో స్ధానం, చైనాకు చెందిన కైమాన్ లు 214.2 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచారు.
ఇదే ఈవెంట్‌లో మరో భారత క్రీడాకారిణి దేవాన్షి రాణా 195.3 పాయింట్లతో నాలుగో స్థానంతో నిలిచింది. అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను జట్టు స్వర్ణం సొంతం చేసుకుంది. మను బాకర్, దేవాన్షి రాణా, మహిమా అగర్వాల్ కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, థాయ్‌లాండ్ నిలిచింది.