బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోనే లేదు. అప్పుడే ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. హ్యూస్ గౌరవార్థం ఉంచిన బ్యాట్‌ను దొంగిలించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ చిత్రం వీడియోకు ఎక్కింది.
క్రికెట్ ప్రపంచం హ్యూస్ మృతికి సంతాపం ప్రకటిస్తుంటే ఓ వ్యక్తి బ్యాట్‌ను దొంగిలిస్తూ వీడియోకు చిక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హ్యూస్ గౌరవార్థం ఆ బ్యాట్‌ను అక్కడ ఉంచారు. అతని ప్రయత్నాన్ని వీడియోలో చూసి అందరూ ముక్కున వెలేసుకుంటున్నారు.

మాజీ జట్టు సహచరుడు ఫిలిప్ హ్యూస్‌కు నివాళులు అర్పించే సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకెల్ క్లార్క్ పదే పదే ఏడుస్తూ కనిపించిన విషయం తెలిసిందే. అతను తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే వారం భారత్‌తో ఉన్న టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఉబికి వచ్చే కన్నీటిని నిలువరించుకోవడానికి ప్రయత్నించాడు.
ఆటగాళ్ల తరఫున క్లార్క్ సిడ్నీ క్రికెట్ మైదానంలో హ్యూస్‌ను నివాళి అర్పిస్తూ ప్రకటన చదివాడు. మంగళవారంనాడు ఈ మైదానంలోనే హ్యూస్ తీవ్రంగా గాయపడి ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. జట్టుగా తమకు జరిగిన నష్టాన్ని మాటల్లో వ్యక్తీకరించలేమని, తాము హ్యూస్ కళ్లలోని మెరుపును కోల్పోయామని క్లార్క్ అన్నాడు. ప్రపంచ ఈ వారం గొప్ప సహచరుడిని కోల్పోయిందని, దానికి తాము అన్నీ కోల్పోయిన పేదలమని ఆయన అన్నాడు.