
హైదరాబాద్: భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం వరల్డ్ ఆర్చరీ ఈ కొత్త ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ప్యారిస్‌లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్ -3లో దీపికా మూడు స్వర్ణ పతకాలు ముద్దాడడంతో నంబర్‌వన్ అయింది. ఆదివారం జరిగిన రికర్వ్ వుమెన్స్ టీమ్, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్, వుమెన్స్ వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లలో దీపికా గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈసారి ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆర్చరీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళ దీపికా కుమారి. డోలా బెనర్జీ తర్వాత ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన భారత ఆర్చర్ దీపికా ఒక్కతే కావడం గమనార్హం.
తన తాజా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన దీపికా కుమారి.. దీనిని కొనసాగించడం ముఖ్యమని చెప్పింది. 'ప్రపంచకప్‌లో మొత్తం 3 స్వర్ణాలు గెలవడం నాకిదే తొలిసారి. నాకెంతో సంతోషంగా ఉంది. అయితే మున్ముందు కీలక పోటీలు ఉన్నాయి. నేనిలాగే మెరుగ్గా రాణిస్తూనే ఉండాలి''అని దీపిక వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్‌పైనే తాను దృష్టి సారించినట్లు తెలిపింది. ఆర్చరీలో ఇప్పటి వరకూ ఇండియాకు ఒలింపిక్ మెడల్స్ రాలేదని, అందుకే ఈ ఈవెంట్ తనకు చాలా ముఖ్యమైనదని దీపికా చెప్పింది.
ప్రపంచకప్‌లో 3 స్వర్ణాలతో సత్తాచాటిన దీపికా కుమారిఫై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడలు అంటే ఎంతో ఇష్టం ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరోయిన్ హంసా నందిని.. దీపికాను అబినందించారు. 'నిజంగా ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన, అద్భుతమైన విజయం. ప్రపంచకప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన దీపికా కుమారి మరియు ఆమె బృందానికి అభినందనలు. మీరు మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నా' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. 'వూహూ పార్టీ పాపర్. దేశానికి 3 స్వర్ణాలు అందించినందుకు ధన్యవాదాలు దీపికా' అని హంసా నందిని ట్వీటారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు సెట్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మహేశ్ బాబు మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. మైత్రీ మూవీ మేకర్స్ 'సర్కారు వారి పాట' షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. జులై మొదటి వారం నుంచి షూట్ మొదలుపెట్టేందుకు రెడీ అవ్వగా..మేకర్స్ మాత్రం మహేశ్ గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నారట.