
హైదరాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ మరో గ్రాండ్ ప్రి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఆరో విజయం కాగా, కెరీర్‌లో 68వ కావడం విశేషం. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వెటెల్‌పై ఆధిక్యాన్ని అతను 30 పాయింట్లకు పెంచుకున్నాడు.
'పోల్ పొజిషన్'తో రేసును మొదలుపెట్టిన రైకోనెన్ 45వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత అదే ల్యాప్‌లో రైకోనెన్‌ను వెనక్కినెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు దీనిని కాపాడుకోగలిగాడు. దీంతో ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇక, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానంలో... మరో ఫెరారీ డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలవడం విశేషం.