Formula1: లాండో నోరిస్ చరిత్ర సృష్టించాడు. 2025 ఫార్ములా 1 సీజన్ చివరి రేసులో అబుదాబి గ్రాండ్ ప్రిలో మూడో స్థానం సాధించడం ద్వారా మెక్‌లారెన్ డ్రైవర్ అయిన లాండో నోరిస్ తన మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ థ్రిల్లింగ్, ఊహించని మలుపులతో కూడిన సీజన్లో అద్భుతమైన పోరాటంతో లాండో నోరిస్ ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సీజన్ ముగింపుకు ముందు లాండో నోరిస్‌తో పాటు రెడ్ బుల్‌కు చెందిన మాక్స్ వెర్‌స్టాప్పెన్, మెక్‌లారెన్ సహచరుడు ఆస్కార్ పియాస్త్రికి కూడా ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది. కానీ నోరిస్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఛాంపియన్‌షిప్ దక్కించుకోవాలంటే తన ప్రత్యర్థుల స్థానాలతో సంబంధం లేకుండా, తనకు ఒక పోడియం ఫినిష్ (మొదటి మూడు స్థానాల్లో ఒకటి) సరిపోతుందని అతనికి తెలుసు.
పోడియం ఫినిష్.. టైటిల్ క్లిన్చ్
అబుదాబి రేసులో వెర్‌స్టాప్పెన్ విజయం సాధించినా, నోరిస్ మాత్రం తెలివిగా డ్రైవింగ్ చేశాడు. రేసులో నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. వెర్‌స్టాప్పెన్ మొదటి స్థానంలో, పియాస్త్రి రెండో స్థానంలో నిలిచారు. టైటిల్ గెలవడంతో భావోద్వేగానికి లోనైన నోరిస్ టీమ్ రేడియోలో "ఐ లవ్ యూ గైస్. అన్నింటికీ ధన్యవాదాలు. మీరు దీనికి అర్హులు," అని ఆనందంగా ప్రకటించాడు. రేసు ప్రారంభానికి ముందు నోరిస్ వెర్‌స్టాప్పెన్ కంటే 12 పాయింట్లు, పియాస్త్రి కంటే 16 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. రేసు ముగిసేసరికి నోరిస్ వెర్‌స్టాప్పెన్ కంటే 2 పాయింట్లు, పియాస్త్రి కంటే 13 పాయింట్ల ఆధిక్యంతో మొత్తం స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

ఒక బ్రిటిష్ ఛాంపియన్ పునరాగమనం
నోరిస్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడంతో 2020లో లూయిస్ హామిల్టన్ తర్వాత ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించిన తొలి బ్రిటిష్ డ్రైవర్‌గా నిలిచాడు. మెక్‌లారెన్ జట్టుకు ఇది 2008 తర్వాత లభించిన తొలి డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్. ఆ సీజన్‌లో కూడా లూయిస్ హామిల్టన్ ఆఖరి రేసులో టైటిల్‌ను గెలుచుకున్నాడు. గత సంవత్సరం (2024) ఛాంపియన్‌షిప్‌ను వెర్‌స్టాప్పెన్‌కు కోల్పోయిన తర్వాత, నోరిస్ అబుదాబి గ్రాండ్ ప్రిలో గెలిచి "వచ్చే సంవత్సరం నాదే అవుతుంది" అని ధైర్యంగా ప్రకటించాడు. అన్నట్టుగానే, అతను తన మాటను నిలబెట్టుకున్నాడు.
సీజన్ సాగిన తీరు
నోరిస్ 2025 సీజన్‌ను టైటిల్ ఫేవరెట్‌గా ప్రారంభించి తొలి రేసును గెలిచాడు. అయితే కొద్ది కాలంలోనే పియాస్త్రి అతనిని అధిగమించి చాలా కాలం పాటు ఛాంపియన్‌షిప్ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. మధ్యలో వెర్‌స్టాప్పెన్ కూడా భారీ పాయింట్ల తేడాతో వెనుకబడ్డాడు. కానీ సీజన్ చివరి అంకంలో పియాస్త్రి వెనుకబడగా నోరిస్ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అబుదాబి రేసులో రెడ్ బుల్ వ్యూహాత్మకంగా తమ రెండో డ్రైవర్ యుకి సునోడాను ఉపయోగించి నోరిస్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఆ ప్రయత్నం విఫలమైంది. సునోడాకు పెనాల్టీ కూడా పడింది. చివరికి తన ప్రత్యర్థులపై విజయం సాధించి, లాండో నోరిస్ తన కల నెరవేర్చుకున్నాడు. "ఈ సంవత్సరం వారు నా జీవితాన్ని సులభతరం చేయలేదు," అని నోరిస్ వెర్‌స్టాప్పెన్, పియాస్త్రి గురించి నవ్వుతూ వ్యాఖ్యానించాడు.