
సెమీస్ పోరులో తొలి గేమ్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి గెలవగా.. ఆ తర్వాత గేమ్‌ను ఇఫాన్ దక్కించుకున్నారు. ఆ తర్వాత రెండు గేమ్‌లను హంపి, ఇఫాన్ చెరొకటి నెగ్గడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ స్థితిలో ఒత్తిడిని తట్టుకుంటూ నిర్ణయాత్మక గేమ్‌ను గెలిచిన హంపి.. ఫైనల్లోకి ప్రవేశించారు. అలెగ్జాండ్రా కోస్తెనెక్ (రష్యా), సరాసాదత్ (ఇరాన్) మధ్య సెమీస్ విజేతతో హంపి.. ఆదివారం టైటిల్ పోరులో తలపడనున్నారు.
స్పీడ్ చెస్‌లో ఇప్పటివరకు జరిగిన మొత్తం మూడు గ్రాండ్ ప్రీ టోర్నీల్లో కోనేరు హంపి మొదటిదాంట్లో తొలి రౌండ్లోనే ఓడారు. రొటేషన్ పద్ధతిలో భాగంగా రెండో గ్రాండ్ ప్రీలో ఆమె ఆడలేదు. మూడో గ్రాండ్ ప్రీలో క్వార్టర్స్‌లో ఓడిన హంపి.. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టోర్నీలో ఫైనల్ చేరారు. మొత్తం నాలుగు గ్రాండ్ ప్రీ టోర్నీల్లో పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య ఈనెల 20న సూపర్ ఫైనల్ జరగనుంది.
భారతీయ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ చెస్ టోర్నమెంట్‌ను హంపి గెలుపొందారు. తొమ్మిది రౌండ్ల టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి టైటిల్‌ను సాధించారు. సహచర క్రీడాకారిణి ద్రోణవల్లి హారికతో జరిగిన చివరి రౌండ్ డ్రాగా చేసుకున్న కోనేరు హంపి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మరో రౌండ్ మిగిలి ఉండగానే ఆమె విజయం సాధించారు. ఇంటర్నేషన్ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది.