
లాస్‌ఏంజెలిస్: నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (ఎన్‌బీఏ) స్టార్, బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయంట్‌కు చెందిన టవల్‌కు భారీ ధర పలికింది. 2016లో లాస్‌ఏంజిల్స్ లేకర్స్ తరఫున చివరి ఎన్‌బీఏ మ్యాచ్ ఆడిన బ్రయంట్.. చివర్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో చెమటను తుడుచుకునేందుకు భుజంపై టవల్ వేసుకున్నారు. ఆ టవల్‌ను ఒక వేలం పాటలో ఉంచగా.. అది 33,077 అమెరికన్ డాలర్లుపలికింది.
ఆదివారం ఆన్‌లైన్‌లో జరిగిన వేలంలో బ్రయంట్ టవల్‌ను లేకర్స్ వీరాభిమాని ఒకరు 33 వేల డాలర్ల (రూ.25 లక్షలు)కు కొనుగోలు చేశాడు. దీంతో దివంగత బ్రయాంట్ మరణానంతరం కూడా తన అభిమానులకు తానెంతటి ఆరాధ్యమో ప్రపంచానికి చాటుతున్నారు. తన 20 ఏళ్ల ఎన్‌బీఏ కెరీర్ మొత్తం లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కే ప్రాతినిధ్యం వహించిన బ్రయంట్.. ఈ ఏడాది జనవరి 26న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన 13 ఏళ్ల కుమార్తె జియానా దుర్మరణం చెందారు.
కొబ్ బ్రయంట్ బాస్కెట్‌బాల్ క్రీడలో ఎంతో సంపాదించారు. గతంలో ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నారు. బాస్కెట్‌బాల్ చరిత్రలో తన కంటూ బ్రయంట్ ఎన్నో రికార్డులు సృష్టించుకున్నారు. అయిదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచారు. 2008, 2012 ఒలింపిక్స్‌ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. రెండు దశాబ్దాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా దిగ్గజం 2016లో రిటైర్మెంట్ ప్రకటించారు.
బ్రయంట్ మరణంకు సంబందించిన ఓ వైరల్ ట్వీట్ అప్పట్లో షాక్‌కు గురిచేసింది. 'బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తాడు' అని డాట్ నోసో అనే ఓ ట్విట్టర్ యూసర్ 2012, నవంబర్ 14న ఓ పోస్ట్ చేసాడు. యాదృచ్చికంగా బ్రయంట్ అదే విధంగా తన ప్రాణాలను కోల్పోయాడు. 7 సంవత్సరాల క్రితం నోసో ఈ ట్వీట్ చేసాడు.