భారత్ వేదికగా మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులను అలరించేందుకు తొలి ఖోఖో ప్రపంచకప్ మొదలు కానుంది. సోమవారం (జనవరి 13) నుంచే ఇది ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా ఇది జరగనుంది.
ఈ ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌లో నేపాల్ - భారత్ తలపడనున్నారు. భారత మహిళల జట్టు మంగళవారం (జనవరి 14) తన తొలి పోరులో కొరియాతో తలపడనుంది. పురుషుల జట్టుకు ప్రతీక్ సారథ్యం వహిస్తుండగా, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.

ఈ ప్రపంచ కప్‌లో పురుషుల కేటగిరిలో 20, మహిళల విభాగంలో 19 జట్లు పోటీపడుతున్నాయి. పురుషుల్లో విభాగంలో గ్రూప్-ఎలో భారత్ తో పాటు బ్రెజిల్, నేపాల్, భూటాన్, పెరూ ఉన్నాయి. గ్రూప్-బిలో ఘనా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, అర్జెంటీనా, గ్రూప్-సిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అమెరికా, దక్షిణ కొరియా, పోలెండ్.. గ్రూప్-డిలో జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, మలేసియా, కెన్యా ఉన్నాయి.
మహిళల విభాగంలో గ్రూప్-ఎలో భారత్, ఇరాన్, దక్షిణ కొరియా, మలేసియా ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఉగాండా, కెన్యా, నెదర్లాండ్స్.. గ్రూప్-సిలో భూటాన్, నేపాల్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్.. గ్రూప్-డిలో పోలెండ్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, పెరూ, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి.
కోచ్‌గా తెలుగోడు
ప్రపంచ క్రీడల్లో తెలుగోళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పుడీ ఖోఖో వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళల జట్టుకు తెలంగాణకు చెందిన ఇస్లావత్ నరేశ్ కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లి తండాకు చెందిన వ్యక్తి నరేశ్.