ఖేలో ఇండియా గేమ్స్-2026కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిష్టాత్మక పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందకు కేంద్ర క్రీడాశాఖ సముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి గురువారం ఢిల్లీలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి లేఖ ద్వారా చేసిన విజ్ఞప్తిని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండవ్యా అంగీకరించారని తెలిపారు.
ఇప్పటికే ఖేలో ఇండియా-2025 గేమ్స్‌కు బిహార్ ఆతిథ్యం ఖరారైన విషయం తెలిసిందే. దీంతో 2026లో అవకాశం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా స్టేడియంలో సౌకార్యాల్ని ఉన్నాయని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. హైదరాబాద్ లో 32వ నేషనల్ స్పోర్ట్స్, ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని లేఖలో ప్రస్తావించింది.

హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్‌నగర్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్ వెల్‌డ్రోమ్, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని వివరించింది. అలాగే క్రీడల వైపు యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని జితేందర్ రెడ్డి తెలిపారు.