హైదరాబాద్: ఒలింపిక్ పతకం భారత్‌కు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమే. అలాంటి అపురూపమైన ఒలింపిక్ పతకాన్ని వేలం వేయనున్నారు. ఆ ఒలింపిక్ పతకం భారత్‌కు లభించిన తొలి వ్యక్తిగత పతకం కావడం విశేషం. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో దిగ్గజ రెజ్లర్ కాసాబా జాదవ్ 27 ఏళ్ల వయసులో ఈ పతకాన్ని గెలుపొందారు.
తన తండ్రి పేరుమీద నెలకొల్పనున్న రెజ్లింగ్ అకాడమీకి నిధులు సమకూర్చుకునేందుకు ఈ పతకాన్ని వేలం వేస్తున్నట్లు జాదవ్ కుమారుడు రంజిత్ జాదవ్ తెలిపారు. జాదవ్ పేరుమీద జల్గాన్‌లో రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని 2009లో అప్పటి మహారాష్ట్ర క్రీడల మంత్రి దిలీప్ దేశ్‌ముఖ్ ఓ ప్రకటన చేశారు.

అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడంతో దానికి నిరసనగా రెజ్లర్ కుటుంబ సభ్యులు అకాడమీ ఏర్పాటుకు పూనుకుంటున్నారు. 2009లో సతారాలో జాతీయ స్థాయి అకాడమీ నెలకొల్పుతామని ప్రకటించిన ప్రభుత్వం ఎనిమిదేళ్ల తర్వాత డిసెంబర్ 2013న రూ. కోటి 58 లక్షలు మంజూరు చేసింది.
అయినప్పటికీ అకాడమీ పనుల్లో ఏమాత్రం పురోగతి లేదు. ఆ తర్వాత పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో పతకాన్ని వేలం వేసి వచ్చిన నిధులను దీనికి ఉపయోగించాలని భావిస్తున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్వర్ణం గెలిస్తే.. హెల్సింకీలో జాదవ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో సరికొత్త చరిత్ర సృష్టించారు.
'ఎంతో అమూల్యమైన ఈ పతకాన్ని వేలం వేయాలనుకోవడం బాధాకరమైన విషయం. కానీ రెజ్లింగ్ అకాడమీ నెలకొల్పడానికి ప్రభుత్వ సాయం అందకపోవడంతో తప్పడం లేదు. మా నాన్న ఏనాడూ తన ఘనతలను ప్రకటించుకోలేదు. 1984 వరకు ఆయన బతికే ఉన్నాడు. ప్రభుత్వం అప్పుడు అర్జున అవార్డు ఇవ్వలేదు. ఆయన మరణించిన 16 ఏళ్లకు అర్జున అవార్డును ప్రకటించారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఈ సత్కారాన్ని ఎందుకు ఇవ్వలేదు' అని రంజిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.