గ్లాస్గో/ న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన పారుపల్లి కశ్యప్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్, అతని స్నేహితులు కలసి ఓ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని చాముండి చెప్పారు. సైనా, సింధులకు గతంలోనూ ఆయన కార్లు బహూకరించిన సంగతి తెలిసిందే.
దేశం కోసం బంగారు పతకాన్ని గెలవాలనే తన చిన్ననాటి కల నెరవేరిందని కశ్యప్ అన్నాడు కామన్వెల్త్ లాంటి పెద్ద ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గడం ఎంతో సంతోషదాయకమని అన్నాడు. ఈ ఉత్తేజంతో తాను మరిన్ని టోర్నీల్లో రాణిస్తానని, ఢిల్లీ గేమ్స్‌లో కాంస్యం సాధించానని లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నానని చెప్పాడు.

కానీ ఈసారి అన్నిఅడ్డంకులూ దాటుకుని ఎట్టకేలకు స్వర్ణ పతకం సాధించానని చెప్పుకున్నాడు. ఫైనల్లో మొదటి గేమ్‌ను సునాయాసంగా గెలిచానని, కానీ రెండో గేమ్‌లో చాలా ఒత్తిడికి లోనయ్యానని, వోంగ్ అలా ఆడతాడనని అస్సలు ఊహించలేదని అన్నాడు. తేరుకునే సమయానికి రెండో గేమ్ కోల్పోయానని, ఇప్పటికైతే రిటైర్మెంట్ ఆలోచన లేదని, మరో నాలుగైదేళ్లు ఆటను కొనసాగిస్తానని కశ్యప్ చెప్పాడు.
ఇదిలావుంటే, కామన్వెల్త్ క్రీడల్లో 32 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకం నెగ్గిన కశ్యప్‌కు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. అలాగే డబుల్స్ రజత పతక విజేత జ్వాల-అశ్విని జోడీకి రూ.10 లక్షలు ప్రకటించారు.
సింగిల్స్ కాంస్యాలు నెగ్గిన యువ షట్లర్లు పీవీ సింధు, గురుసాయి దత్‌కు రూ.5 లక్షలు, క్వార్టర్స్‌లో ఓడిన కిడాంబి శ్రీకాంత్, తులసీకి ఒక లక్ష చొప్పున ఇవ్వనున్నారు. ఈ క్రీడల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసినందుకు జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు బాయ్ అధ్యక్షుడు అఖిలేశ్ దాప్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు.