
హైదరాబాద్: దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. శుక్రవారం జరిగిన పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ పురుషుల, మహిళల విభాగంలో భారత షూటర్లు రెండు పసిడి పతకాలు సాధించారు.
పురుషుల విభాగంలో హృదయ్ హజరికా స్వర్ణం సాధించగా, మహిళల విభాగంలో ఎలవెనిల్ వలరివన్, శ్రేయా అగర్వాల్, మానిని కౌశిక్ బృందం స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 627.3 స్కోరుతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌కు హృదయ్ అర్హత సాధించాడు.
ఫైనల్‌లో 250.1 స్కోరుతో ఇరాన్ షూటర్ మహ్మద్ అమీర్ నెకోనమ్ తలపడగా వీరిద్దరూ స్కోరు పరంగా సమం అయ్యారు. దీంతో నిర్వాహకులు షూట్‌ఆఫ్ నిర్వహించగా హృదయ్ పసిడిని సొంతం చేసుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన ఇరాన్ షూటర్‌కు రజతం లభించింది.
ఇక, మహిళల 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ జూనియర్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన ఎలవెనిల్ వలరివన్(631 స్కోరు), శ్రేయా అగర్వాల్(628.5), మానికి కౌశిక్(621.2) బృందం స్వర్ణం నెగ్గింది. దీంతో పాటు మొత్తం 1880.7 స్కోరుతో ఈ విభాగంలో భారత బృందం ప్రపంచ రికార్డుని నెలకొల్పింది.
మరోవైపు ఇదే ఈవెంట్‌లో పురుషుల టీమ్ విభాగంలో హృదయ్, దివ్యాన్ష్ పన్వార్, అర్జున్ బబుటా జోడీ నాలుగోస్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. 50 మీటర్ల రైఫిల్ విభాగంలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈ విభాగంలో భారత్ నుంచి ఏ షూటర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.