హైదరాబాద్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జీతూ రాయ్, హీనా సిద్దు గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్‌కు అర్హత సాధించేందుకు గాను నిర్వహించిన క్వాలిఫై రౌండ్‌లో 800కుగాను 767 పాయింట్స్ సాధించి భారత్ తొలి స్థానంలో నిలిచింది.
ఫైనల్లో భారత్... ఫ్రాన్స్‌తో తలపడింది. ఫైనల్లో భారత 483.4 పాయింట్లు సాధించగా, రెండో స్ధానంలో నిలిచిన ఫ్రాన్స్ 481.1 పాయింట్లు సాధించింది. ఇక 418.2 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచిన చైనా రజత పతకంతో సరిపెట్టుకుంది.
కాగా, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జీతూ, హీనాల జోడీకి ఇది మూడో బంగారు పతకం కావడం విశేషం. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో జీతూ, హీనా జోడీ చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. జీతూ రాయ్ అంతకముందు కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించాడు.
ఈ టోర్నీలో 10 మీటర్ ఫ్రీ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలోనూ పాల్గొననున్నాడు. ఇక, హీనా సింధు కూడా మాజీ కామన్వెల్త్ ఛాంపియన్. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తొలిసారి ప్రయోగాత్మకంగా వరల్డ్‌కప్స్‌లో ప్రవేశపెట్టారు. 2020లో టోక్యో ఆతిథ్యమిచ్చే ఒలింపిక్స్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.