
ఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్ని పతకాలు భారతీయ మహిళా షూటర్లు కైవసం చేసుకోవడం విశేషం. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగంలో చింకీ యాదవ్‌కు స్వర్ణం, రాహీ సావంత్‌కు రజతం, మను బాకర్‌కు కాంస్యం దక్కింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ముగ్గురిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సీనియర్లను వెనక్కి నెట్టి 23 ఏళ్ల చింకీ యాదవ్ స్వర్ణం కైవసం చేసుకుంది. రహీ సర్నబోత్ (30)తో పోటీ పడి అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో రహీ, చింకీ స్కోర్లు 32తో సమం కాగా.. షూటాఫ్‌లో చింకీ 4-3 తేడాతో రహీని ఓడించింది. మను బాకర్ 28 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. ఈ ముగ్గురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం గమనార్హం. 2019లో దోహాలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలుచుకున్న చింకీ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.
పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీల్లో యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణం గెలిచాడు. 462.5 పాయింట్లతో తోమర్ అగ్ర స్థానంలో నిలిచాడు. హంగేరీ షూటర్ ఇస్తవాన్ పెని (461.6), డెన్మార్క్ క్రీడాకారుడు స్టీఫెన్ ఓల్సెన్ (450.9) రెండు, మూడో స్థానాల్లో నిలిచి రజతం, క్యాంసం గెలుచుకున్నారు. ఇదే పోటీలో సంజీవ్ రాజ్‌పుత్, నీరజ్ కుమార్ వరుసగా ఆరు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. 2019 ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లోనే కాంస్యం గెలిచిన తోమర్ అప్పుడే ఒలింపిక్స్ బెర్త్ పట్టాడు.