
హైదరాబాద్: అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) రష్యా క్రీడాకారులకు ఓ శుభవార్త ప్రకటించింది. డోపింగ్ వివాదం వల్ల ఒలింపిక్ నిషేధాన్ని ఎదుర్కొంటున్న రష్యాకు ఉపశమనాన్ని ప్రకటించింది. ఇటీవల దక్షిణకొరియాలో ముగిసిన వింటర్ ఒలింపిక్స్‌లో రష్యాపై నిషేధం ఉండడంతో ఆ దేశ అథ్లెట్లు స్వతంత్రంగా బరిలోకి దిగారు.
2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో రష్యా డోపింగ్‌కు పాల్పడిందంటూ వార్తలు రావడంతో వింటర్ ఒలింపిక్స్ రావద్దంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది ఐఓసీ. అయితే ఈ పోటీలకు క్రీడాకారులు రష్యా తరపున కాకుండా వ్యక్తిగతంగా పాల్గొనవచ్చంటూ అవకాశాన్నిచ్చిన సంగతి తెలిసిందే.
''పరీక్షల్లో రష్యా అథ్లెట్లు ఎలాంటి డ్రగ్స్ వాడలేదని తెలియడంతో ఆ దేశంపై ఉన్న నిషేధం తొలగిపోయింది'' అని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్‌ఓసీ) అధ్యక్షుడు అలెగ్జాండర్ ఈ ప్రకటనను స్వాగతించాడు. ''ఆర్‌ఓసీ తిరిగి తన హక్కులు పొందినందుకు ఆనందంగా ఉంది'' అని అలెగ్జాండర్ తెలిపాడు.
ఇటీవలే జరిగిన వింటర్ ఒలింపిక్స్ వేడుకలు ఫిబ్రవరి 9వ తేదీన ప్యాంగ్ చాంగ్ నగరంలో జరిగాయి. ఈ ప్రారంభ వేడుకలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తన ప్రతినిధి బృందంతో హాజరైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ జరిగిన వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు ఇవాంకా ట్రంప్ తన ప్రతినిధుల బృందంతో హాజరై విజేతలను అభినందించారు.