
హైదరాబాద్: చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 6,000 మందికి పైగా మృతి చెందగా.. 1,60,000 మందికి పైగా సోకింది. కరోనా వైరస్ రోజు రోజుకూ పంజా విసురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ).. క్రీడా సభ్య సంఘాలతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
జూలై 24న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌కు ఇంకో 130 రోజులు మాత్రమే సమయం ఉంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే అనేక క్రీడా ఈవెంట్లు రద్దవుతున్నాయి. దీంతో ఒలింపిక్స్ సజావుగా సాగడంపై సందేహలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణలో తలెత్తనున్న ఇబ్బందులపై చర్చించేందుకు ఒలింపిక్స్‌లో భాగమైన క్రీడలకు సంబంధించి ప్రపంచ సమాఖ్యలతో, వివిధ దేశాల జాతీయ ఒలింపిక్ సంఘాలు, క్రీడాకారుల సంఘాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ఓ ప్రకటనలో తెలిపారు.
స్విట్జర్లాండ్ సాకర్ సమాఖ్య అధ్యక్షుడు డొమినిక్ బ్లాంక్‌కు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఉదయం వచ్చిన పరీక్ష ఫలితాల్లో 70 ఏళ్ల డొమినిక్‌కు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని సమాఖ్య ప్రకటించింది. అతను ప్రస్తుతం ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉన్నాడు. 'ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. కొద్దిపాటి ప్లూ లక్షణాలు మాత్రమే ఉన్నాయి' అని డొమినిక్ బ్లాంక్ పేర్కొన్నారు.
డొమినిక్ బ్లాంక్‌కు కరోనా రావడంతో ఆ సమాఖ్య ప్రధాన కార్యాలయాన్ని మూసేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులకు వైద్య సదుపాయాన్ని అందించారు. మర్చి 3న ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన యురోసియన్ సాకర్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) వార్షిక సమావేశంలో డొమినిక్ పాల్గొన్నాడు. ఇటీవల అతనికి గొంతునొప్పి, దగ్గు వస్తుండడంతో.. కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు సెర్బియా సాకర్ సమాఖ్య అధ్యక్షుడు 42 ఏళ్ల స్లవిసా కొకెజాకు కూడా కరోనా సోకింది.
ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నా.. ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామనే జపాన్ అంటోంది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆ దేశ ప్రధాని షింజొ అబే శనివారం చెప్పారు. 'కరోనా వైర్‌సను అధిగమిస్తాం. ఎలాంటి సమస్య లేకుండా షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తాం' అని టోక్యోలో జరిగిన విలేకరుల సమావేశంలో అబే ప్రకటించారు. ఒలింపిక్స్ వాయిదా లేదా రద్దు గురించి తాము ఆలోచించడం లేదన్నారు.