న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధంతో పాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్ ల జరిమానా కూడా విధించింది. ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో భాగంగా ఇంచియాన్‌లో ఆమె పతకం నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించిన సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్‌లో దక్షిణకొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల బాక్సింగ్ సెమీ ఫైనల్ మ్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సరితా దేవిపై తన ప్రత్యర్థి కొరియా బాక్సర్ పార్క్ విజేతగా నిలిచింది.

దాంతో, తీవ్ర నిరాశచెందిన సరితా దేవి బహుమతి కార్యక్రమ సమయంలో తన కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించి... పతకాన్ని అక్కడే వదిలేసింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాక్సింగ్ సమాఖ్య పైచర్యలు తీసుకుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో సరితా దేవి తిరిగి బాక్సింగ్ పోటీలకు అర్హత పొందనుంది.
ఇటీవల అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నుంచి నిషేధానికి గురైన సరితా దేవికి దేశం యావత్తు మద్దతివ్వాలని సచిన్ కోరిన విషయం తెలిసిందే. ఇంచియాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్‌సలో సరితా తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఏఐబీఏ ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై సచిన్ కేంద్ర క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్‌ను కలవడం... సరితాదేవి భవిష్యత్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.