
హైదరాబాద్: ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ విజేత మేరీ కోమ్ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొనలేదట. ప్రాక్టీస్ సెషన్‌లో ఆమెకు కల్గిన గాయమే ఇందుకు కారణమని ఆమె వివరించింది. ఆదివారం జనవరి 7వ తేదీ నుంచి మొదలుకాబోతున్న ఈ ఛాంపియన్ షిప్ వారం రోజుల పాటు జరగనుంది.
ఈ పోటీలు కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సెలక్షన్ ట్రయల్స్‌గా భావిస్తు న్నారు. సరితాదేవి, సర్జుబాలా సహా మొత్తం 300 మందికిపైగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కాగా, ఇప్పటికీ 36 మంది వరకు వ్యక్తిగతంగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ప్రపంచ మహిళల యూత్ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత శశి చోప్రా సైతం ఈ పోటీల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "ఇది నాకు సీనియర్ లెవల్స్‌లో మొదటి గేమ్. అందుకే కొంచెం బెరుకుగా ఉంది. కానీ, నేను ఎలైట్ లెవల్ గెలవగలననే నమ్మకంగానూ ఉంది" అంటూ అభిప్రాయపడింది.
మేరీ కోమ్ బాక్సింగ్ పరిశీలకురాలి పదవికి రాజీనామా చేసి మళ్లీ క్రీడాకారిణిగా అడుగుపెట్టిన విషయం విదితమే.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదం నెలకొనడంతోనే మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న క్రీడాకారులు ఎవరైనా ఇలాంటి పదవుల్లో ఉండకూడదన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ ఆదేశాలతో మేరీ కోమ్ రాజీనామా చేసినట్లు ప్రకటించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.