ఆసియా క్రీడా సంరంభానికి అద్భుతమైన ఆరంభం
జకర్తా: ఇండోనేషియా వేదికగా 'ఆసియా గేమ్స్ 2018' టోర్నీ అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమైంది. వేలాది మంది అథ్లెట్లు ఒకే గూటికి చేరిన వేళ ఇండోనేషియా వెలిగిపోయింది. కళాకారుల నృత్య ప్రదర్శనలతో పాటు లేజర్ షో అభిమానులను ఆకట్టుకున్నాయి. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా నేతృత్వంలో భారత బృందం మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొంది. మొత్తం 36 క్రీడాంశాల్లో భారత అథ్లెట్స్ పోటీపడుతున్నారు.
జకార్తా నగరంలోని ప్రధాన స్టేడియంలో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు..లేజర్ షోల మెరుపులతో దాదాపు రెండుగంటలకు పైగా అలరిస్తూ సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆహుతులను మరో లోకంలో విహరింపజేశాయి. దేశ సంస్కృతిని చాటి చెబుతూ దేశంలోని యునెస్కో వారసత్వ కట్టడాల జాబితా ప్రకారం సంప్రదాయ నృత్యం సమన్ డ్యాన్స్‌తో కార్యక్రమం ప్రారంభమైంది. అసేహ ప్రావిన్స్‌లోని గాయో జాతి ప్రజలకు సంబంధించిన ఈ నృత్య రూపకాన్ని దాదాపు 2200మందికి పైగా బాలబాలికలు స్టేజిపై అదరహో అనిపించేలా ప్రదర్శించారు.

దేశాధ్యక్షుడే బైక్ మీద వచ్చి..:
ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడో క్రీడలను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. జకార్తా నగరంలో అధ్యక్షుడు జొకో విడూడో కాన్వాయ్ ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోవడంతో ఎవరూ ఊహించనిరీతిలో ఆయన బైక్‌ను తీసుకుని సమయానికే స్టేడియానికి చేరడం హైలైట్‌గా నిలిచింది.

572 మంది భారత అథ్లెట్ల బృందానికి నీరజ్ చోప్రా:
572 మంది భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహిస్తూ జాతీయ జెండాను చేతబూని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ముందుకు కదిలాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ టీమ్ మొత్తం 57 పతకాలు గెలవగా.. అందులో 11 పసిడి ఉన్నాయి. తాజాగా టోర్నీలో ఆ పతకాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. బ్యాడ్మింటన్, జావెలిన్ త్రోయర్, ట్రాక్ అండ్ ఫీల్డ్, కబడ్డీ తదితర విభాగాల్లో భారత్ బలంగా కనిపిస్తోంది.

స్టేడియంలో 50 వేలమందికిపైగా అభిమానులు
ఆ దేశ చిహ్నం గరుడ పక్షి వేషం ధరించిన కళాకారులు ముందు నడవగా ఈ క్రీడల్లో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు మార్చ్‌పాస్ట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండోనేషియా స్టార్ కొరియోగ్రాఫర్లు డాని మలిక్, ఎకొ సుప్రియాంటో రూపకల్పన చేసిన నృత్యాలను వేలాది మంది కళాకారులు ప్రదర్శిస్తుండగా స్టేడియంలోని 50 వేలమందికిపైగా అభిమానులు మంత్రముగ్దులుయ్యారు. ప్రముఖ గాయకులు అన్‌గున్, రైసా, తులుస్ తదితరులు పాడిన పాటలు అందర్ని అలరించాయి. 100 మంది సభ్యుల వాద్య బృందం చేసిన ప్రదర్శన కూడా అభిమానులను ఆకట్టుకుంది.

తూర్పు.. దక్షిణం కలిసి కవాతు:
బద్ధ శత్రువులైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కలిశాయి. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మార్చ్‌పాస్ట్‌లో రెండు దేశాల బృందాలు కలిసి నడిచాయి! ఇలా మార్చ్‌పాస్ట్ చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. ప్యాంగ్‌చాంగ్ శీతాకాల ఒలింపిక్స్ సమయంలోనూ ఈ రెండు దేశాలు కలిసి నడిచాయి. ఇండోనేషియా బృందంతో పాటు దక్షిణ, ఉత్తర కొరియా అథ్లెట్లు స్టేడియంలో ప్రవేశించినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు కరతాళ ధ్వనులు చేశారు.

ప్రకృతి వైపరీత్యాలు అవరోధాలు కాదంటూ:
స్టేడియంలో ఇరు వైపులా ఇండోనేషియా సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యం చేస్తున్న 5000 వేల మంది కళాకారులు.. డప్పుల మోతలు.. లేజర్ వెలుగుల మధ్య 18వ ఆసియా క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. 45 దేశాల నుంచి దాదాపు 13,000 వేల మంది అథ్లెట్లు మార్చ్‌పాస్ట్ చేస్తుండగా జకర్తాలోని గెలోర్ బంగ్ కర్నో ప్రధాన స్టేడియం వెలిగిపోయింది. టెర్రరిజం లాంటి సమస్యలున్నా.. భూకంపాల్లో చిక్కుకున్నా అతి పెద్ద క్రీడా సంబరాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండోనేషియా ఈ క్రీడల ప్రారంభోత్సవంలో తెలియజెప్పింది.

53 ప్రధాన నగరాలను దాదాపు నెలరోజులపాటు..:
భారత్‌లోని న్యూఢిల్లీ నుంచి మొదలై ఆసియా దేశాలలోని 53 ప్రధాన నగరాలను చుడుతూ దాదాపు నెలరోజులపాటు సాగిన టార్చ్ రిలే క్రీడల ప్రారంభోత్సవ సమయానికి జకార్తా చేరుకుంది. నగరంలో ఇండోనేషియా మాజీ దిగ్గజ ఆటగాళ్లతోపాటు ప్రపంచంలోని మేటి అథ్లెట్లంతా నగరంలో జరిగిన టార్చ్‌రిలేలో పాల్గొన్నారు. స్టేడియంలోపలికి చేరిన టార్చ్‌ను చివరగా చేతబట్టిన ఇండోనేషియా దిగ్గజ షట్లర్ సుశిసుశాంతి క్రీడల జ్యోతిని వెలిగించింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ సింగిల్స్‌లో దేశానికి బంగారు పతకం అందించిన సుశాంతికి ఈ క్రీడల సందర్భంగా అరుదైన గౌరవం లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications